Prime Minister Modi Arrived In Hyderabad And Attended The Road Show : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం హైదరాబాద్‌ చేరిన ప్రధాని మోదీ రోడ్డు షోలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాని రోడ్డు షో కొనసాగింది. ఈ రోడ్ షోలో ప్రధాని మోదీతోపాటు బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల, భువనగిరికి చెందిన చెందిన ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు రోడ్డు షోలో పాల్గొన్నారు. సుమారు 1.5 కిలో మీటర్లు మేర ఈ రోడ్డు షో కొనసాగింది. ఓపెన్‌ టాప్‌ వాహనంపై నిల్చుకుని ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్డు షోలో ముందుకు సాగారు. దారి వెంబడి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. మోదీ.. మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భధ్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు. 


మూడు రోజుల పర్యటన


ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం రోడ్డు షో నిర్వహించిన ప్రధాని మోదీ.. శనివారం నాగర్‌ కర్నూల్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 18న జగిత్యాలలో జరగనున్న సభలో పాల్గొంటారు. ఈ సభల్లో భాగంగా ప్రధాని మోదీ గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశముంది. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పడంతోపాటు రాష్ట్ర పాలకుల వ్యవహారశైలి, విధానాలపై విమర్శలు గుప్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం రోడ్డు షో ముగిసిన తరువాత ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఇదిలా, ఉంటే హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితోపాటు బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు.