Secunderabad Parliamentry Constituency: హైదరాబాద్: తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. మరోసారి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. సికింద్రాబాద్పార్లమెంట్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈసారి బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించబోతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్లో మజ్లిస్పార్టీని, అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)ని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం. పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. దేశం కోసం, ధర్మకోసం, ప్రజల సంక్షేమం కోసం గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వచ్చే 5 సంవత్సరాలు మరింత అంకితభావం, సేవాభావంతో పని చేస్తాం. దేశ ప్రజలు కూడా మోదీని మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎన్డీఏ టార్గెట్ 400 సీట్లు..
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాం. దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు. మోదీ నాయకత్వంలో ప్రజలకు మరో 5 సంవత్సరాలు సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి కొనసాగిస్తాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత 4 సెక్టార్ల ద్వారా దేశంలో పని చేయబోతున్నాం. మహిళలు, యువకులు, రైతులు, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం. బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని’ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సనత్ నగర్ డివిజన్, మైసమ్మ టెంపుల్ లో పవర్ బోర్ ప్రారంభించారు. అమీర్ పేట్ డివిజన్, బాపూ నగర్ లో ఆర్వోర్ ప్లాంట్ ను షురూ చేశారు. ఎస్ఆర్ నగర్ వాటర్ ట్యాంక్ పార్క్ లో, దివ్య శక్తి అపార్ట్ మెంట్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. బేగంపేట్ డివిజన్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఓపెన్ జిమ్ ను ఓపెన్ చేశారు.
మొండా మార్కెట్ డివిజన్, గ్యాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో ఓపెన్ జిమ్, బన్సీలాల్ పేట డివిజన్, న్యూ బోయిగూడ, జీహెచ్ఎఎంసీ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అడ్డగుట్ట డివిజన్, సాయి నగర్ లో పవర్ బోర్, కొండారెడ్డి కాలనీ పార్క్ లో ఓపెన్ జిమ్, తార్నాక డివిజన్, లాలాపేట్, వినోభా నగర్ లలో కమ్యూనిటీ హాల్, పవర్ బోర్ ను ప్రారంభించారు. తార్నాక డివిజన్, నాన్ టీచింగ్ హోమ్ ఓయూ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్వర డివిజన్, జూబ్లీహిల్స్ డివిజన్ లలో ఓపెన్ జిమ్ లను ప్రారంభించారు