Hyderabad Real Estate Shock :  హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ  వివాదం వెలుగులోకి వచ్చింది.  నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డు పార్క్ హోటల్ సమీపంలో  ప్రముఖ నిర్మాణ సంస్థ  ప్రదీప్ కన్స్ట్రక్షన్స్' చేపట్టిన భారీ మల్టీ స్టోరీడ్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్ గరిష్ట వరద మట్టం  పరిధిని ఆక్రమించడంతో పాటు, తీవ్ర వివాదాస్పద భూమిలో ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్డింగ్‌కు ఇచ్చిన నిర్మాణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ బిల్డింగ్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో.. ఈ అపార్ట్‌మెంట్‌లో కోట్లు పోసి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు షాక్‌కు గురవున్నారు. 

Continues below advertisement

ప్రదీప్ రెడ్డి బద్వేలు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి యాజమాన్యంలోని ఈ సంస్థ.. సోమాజిగూడలో 2 సెలర్స్ + స్టిల్ట్ + 17 పైఅంతస్తులతో పాటు ఒక భారీ క్లబ్ హౌస్‌తో కూడిన రెండు స్కైస్క్రాపర్ టవర్లను నిర్మించింది. అయితే, ఈ ప్రాజెక్ట్ నిర్మించిన ల్యాండ్ పూర్తిగా వివాదాస్పదమైనదని, పైగా చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని నిర్ధారణ కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్, 1955 లోని  సెక్షన్ 450  కింద ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు మున్సిపల్ అధికారులు  షోకాజ్ నోటీసు  జారీ చేశారు. నిర్మాణ అనుమతులు పొందే సమయంలో బిల్డింగ్ నిర్వాహకులు అసలు నిజాలను దాచిపెట్టారని , తప్పుడు పత్రాలతో తప్పుదోవ పట్టించి  పర్మిషన్లు పొందారని అధికారులు ఈ నోటీసులో ప్రాథమికంగా తేల్చారు. 

 ఈ వివాదాలు ఉన్నందున సదరు 17 అంతస్తుల బిల్డింగ్‌కు సంబంధించి బిల్డర్ దరఖాస్తు చేసుకున్న  ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ను జీహెచ్‌ఎంసీ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ఈ భవనానికి ఎలాంటి ఓసీ జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ తీసుకున్న ఈ ఆకస్మిక చర్యతో సదరు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలంతా ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. తమ జీవితకాల సంపాదనను, బ్యాంకు లోన్లను నమ్ముకుని కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ 17 అంతస్తుల టవర్లలో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చట్టప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్  లేని బిల్డింగ్‌లోకి ప్రవేశించడం, నివసించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఒకవేళ విచారణ అనంతరం జీహెచ్‌ఎంసీ గనుక బిల్డింగ్ పర్మిషన్‌ను పూర్తిగా రద్దు చేస్తే.. ఈ భవనానికి విద్యుత్, తాగునీటి కనెక్షన్లు కూడా దక్కవు.

Continues below advertisement

హైడ్రా , జీహెచ్‌ఎంసీ జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించిన తర్వాతే ఈ అక్రమాలు వెలుగుచూశాయని టాక్ నడుస్తోంది. బిల్డర్ చేసిన తప్పుకు, తప్పుడు డాక్యుమెంట్లు నమ్మి మోసపోయిన తాము ఇప్పుడు బలిపశువులమయ్యామని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఒకవైపు బిల్డింగ్ పర్మిషన్ రద్దు ముప్పు, మరోవైపు ఓసీ రాకపోవడంతో.. కొన్న ఫ్లాట్లలోకి ఎప్పుడు అడుగుపెడతామో, అసలు ఈ బిల్డింగ్ నిలుస్తుందో లేదో తెలియని అగమ్యగోచర స్థితిలోకి హోమ్ బైయర్స్ నెట్టబడ్డారు. ఈ వ్యవహారంపై ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చే వివరణపైనే ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది.