BJP National President Nitin Navin Hyderabad Tour:  తెలంగాణ రాజకీయాల్లో   తదుపరి సమరం హైదరాబాద్ మహానగరం వేదికగా ప్రారంభం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  కాంగ్రెస్ ప్రభుత్వం పాత 1955 నాటి యాక్ట్‌ను రద్దు చేసి పాత గ్రేటర్‌ను మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా  విభజించి, డివిజన్ల సంఖ్యను 150 నుండి ఏకంగా 300 కి పెంచి ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ వేస్తున్న ఈ త్రిశూల వ్యూహాన్ని తిప్పికొట్టి, హైదరాబాద్‌పై ఎలాగైనా  జెండా ఎగరేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ  హైకమాండ్ తన వ్యూహాలకు పదును పెట్టింది.

Continues below advertisement

గ్రేటర్ టార్గెట్ పెట్టి వెళ్లిన నితిన్ నవీన్ 

ఇందులో భాగంగానే ఇటీవల బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అత్యంత యువ లీడర్  నితిన్ నవీన్   హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా పర్యటించి, రాష్ట్ర కోర్ కమిటీ నేతలకు గట్టి వార్నింగ్ ,  దిశానిర్దేశం చేసి వెళ్లారు. నితిన్ నవీన్ తన అంతర్గత సమావేశాల్లో రాష్ట్ర నేతలకు అత్యంత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.  పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ సిటీలు ఎప్పుడూ బీజేపీకి బలమైన కోటలు. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఎంపీ స్థానాలు గెలిచినంత మాత్రాన సరిపోదు.. ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో మన సత్తా చాటకపోతే, తెలంగాణలో అధికారం చేపడతామనే బీజేపీ కల భవిష్యత్తులో కేవలం  కలగానే మిగిలిపోతుంది  అని ఆయన కుండబద్దలు కొట్టారు. నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, కలిసికట్టుగా పోరాడకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  మూడు ముక్కల వ్యూహం - మూడు సవాళ్లు

Continues below advertisement

 గ్రేటర్‌ను విభజించడం వెనుక కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్ ఉంది. ఓల్డ్ సిటీ పరిధిలోని  హైదరాబాద్ , ఐటీ కారిడార్ ఉన్న  సైబరాబాద్ , ఉద్యోగులు-మధ్యతరగతి ఎక్కువగా ఉండే  మల్కాజ్‌గిరి .. ఈ మూడింటికీ వేర్వేరు వ్యూహాలు కావాలని నితిన్ నవీన్ స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇవి కేవలం మున్సిపల్ ఎన్నికలు కావు.. వారి సొంత రాజకీయ భవిష్యత్తును, ఉనికిని చాటుకోవడానికి ఒక అగ్నిపరీక్ష. అందుకే జాతీయ అధ్యక్షుడి పర్యటన ముగిసిన వెంటనే తెలంగాణ బీజేపీ నేతలంతా గ్రేటర్ మున్సిపల్ పరిధిపై అంతర్గత కసరత్తు  తీవ్రం చేశారు. గత 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాలు గెలుచుకుని బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పుడు బీఆర్ఎస్ బాగా బలహీనపడిన తరుణంలో.. ఆ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా పూర్తిగా తమ వైపు తిప్పుకోవడమే బీజేపీ ముందున్న అసలైన టాస్క్.

డివిజన్ల వారీగా వ్యూహం 

 కొత్తగా ఏర్పడిన  సైబరాబాద్ ,  మల్కాజ్‌గిరి  కార్పొరేషన్ల పరిధిలో ఐటీ ఉద్యోగులు, వలస ప్రజలు, ఇతర రాష్ట్రాల ఓటర్లు   అత్యధికంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్ సాంప్రదాయకంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఇష్టపడుతుంది కాబట్టి, ఇక్కడ క్షేత్రస్థాయిలో సరైన అభ్యర్థులను నిలబెడితే మేజర్‌గా లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు బూచీని చూపిస్తూ గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, మూడు కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్లలోనూ బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసే పనిలో బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.

జాతీయ నాయకత్వానికీ ముఖ్యమే 

  ఈ త్రిముఖ కార్పొరేషన్ పోరు తెలంగాణ భవిష్యత్తు రాజకీయ గమనాన్ని మార్చనుంది. కాంగ్రెస్ అధికార బలాన్ని, వ్యూహాలను తట్టుకుని నిలబడాలంటే బీజేపీ కేవలం సోషల్ మీడియా పాలిటిక్స్ నమ్ముకుంటే సరిపోదు.. క్షేత్రస్థాయిలో రోడ్ల పైకి వచ్చి పోరాడాల్సి ఉంటుంది. జాతీయ నాయకత్వం పంపిన అల్టిమేటంతో అప్రమత్తమైన తెలంగాణ బీజేపీ లీడర్లు.. ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి సరికొత్త కార్యాచరణతో ముందుకు కదులుతున్నారు. ఒకవేళ ఈ మూడు స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తే.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.