Power Commission Notices to KCR: యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో భారీ ఎత్తున చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో నెలకొన్న అవకతవకలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో ఇప్పటివరకు కమిషన్కు వచ్చిన సమాచారం పై మీ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ కేసీఆర్ ను కమిషన్ కోరింది. ఈనెల 27వ తేదీలోపు నోటీసుకు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు సూచించింది. ఈనెల 19వ తేదీన కేసీఆర్కు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కి, మరికొంత మందికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో రెండోసారి పవన్ కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా గతంలో ఇచ్చిన నోటీసుల్లో పవర్ కమిషన్ పేర్కొంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు.
నరసింహారెడ్డి కమిషన్ విచారణ పై స్టే విధించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవర్ కమిషన్ విచారణను తక్షణమే నిలిపివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత మార్చి 14న పవర్ కమిటీ ఏర్పాటు
పదేళ్ల కేసీఆర్ పదవీ కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు గత మార్చి 14న కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే ఈ కేసులో విచారణను ప్రారంభించింది. విద్యుత్ శాఖతో సంబంధం ఉన్న దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. కేసీఆర్ కు కూడా ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆయన కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. అందులో కమిషన్ కు చట్టబద్ధత లేదని, జస్టిస్ నరసింహా రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేఖలో కోరారు. దీనిపై ఇవాళ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టక ముందే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై కేసీఆర్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.