Telangana News | హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాల కోసం తాము చేసే పనుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని మొదట్నుంచీ కోరుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగుతున్న తమ 'ప్రజా పాలన'కు ప్రజలే అండగా నిలుస్తున్నారని, అందుకే వరుసగా పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. అధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే గెలుపొందారని చెప్పారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలు ఇటీవల చేస్తున్న ఘాటు వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా 'తోలు తీసే' హక్కు కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓడించడం ద్వారా కేసీఆర్ నేతృత్వంలోని పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి చర్చించాలి..
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినట్లుగా, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని, అక్కడ తమ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనా ఉంటే చర్చించాలని ప్రతిపక్షనేతకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం హాస్టల్ అద్దెలను పెండింగ్‌లో పెడితే తాము చెల్లించామని, గోదాముల్లో నడుస్తున్న పాఠశాలలకు సొంత భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అని తాము చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరించారు. సొంత పార్టీ, కుటుంబ వ్యవహారాలపై కవిత చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ప్రజలు సహించబోరని ఆయన స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారు.. లేఖ రాయాలికేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. గడచిన 12 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద కిషన్ రెడ్డి చివాట్లు తిన్నారని వార్తలు వస్తున్నాయని, కేసీఆర్ మెప్పు కోసమే ఆయన లేఖలు రాస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, వాటాల కోసం బీజేపీ మరియు స్థానిక ప్రతిపక్షాలు ఎందుకు పోరాడటం లేదని, ప్రజలకు అన్యాయం చేస్తే వారు చూస్తూ ఊరుకోరని పొన్నం ప్రభకర్ హెచ్చరించారు.
మోదీ పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ ఉంది..
కాంగ్రెస్ పార్టీ చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, నరేంద్ర మోదీ పుట్టక ముందే స్వాతంత్ర్యం కోసం ఎందరో నేతలు ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. దివంగత ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి మహనీయుల పేర్లు కనిపించకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకానికి గాడ్సే పేరు పెట్టే ప్రయత్నం చేయడం దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడమేనని మండిపడ్డారు.