Phone Tapping case | హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అత్యున్నత పదవుల్లో కొనసాగిన ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను సాక్షులుగా విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. వీరితో పాటు సాధారణ పరిపాలన శాఖ (GAD) మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావును కూడా విచారించిన అధికారులు, అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ నంబర్ల మంజూరు, అందుకు పరిపాలనాపరమైన అనుమతులపై ఆయన్ని ప్రశ్నించారు. మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్రకు సిట్ నోటీసులు జారీ చేసింది.
ప్రభాకర్ రావును తిరిగి నియమించడంపై ఆరా తీసిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు విచారణలో ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం, ఆయన వ్యవహారశైలిపై సిట్ దృష్టి సారించింది. పదవీ విరమణ తర్వాత ప్రభాకర్ రావును ఎస్‌ఐబీలో ఓఎస్‌డీగా (OSD) నియమించడం వెనుక ఉన్న కారణాలను, ఆ ప్రక్రియలో ఐఏఎస్ అధికారుల పాత్రను అధికారులు లోతుగా ఆరా తీశారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు సినీ ప్రముఖుల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలతో, ఆయన సూచించిన నంబర్లను ఎలాంటి పరిశీలన లేకుండా హోం శాఖకు పంపడంపై మాజీ ఐపీఎస్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందును కూడా విచారించి, నాటి ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల్లో ఇంటెలిజెన్స్ విభాగం సమన్వయంపై స్పష్టత కోరారు.
గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన ఈ అధికారులందరినీ సాక్షులుగా పరిగణిస్తూ, వారి వాంగ్మూలాల ఆధారంగా కేసులో మరిన్ని లోతైన విషయాలను వెలికితీసేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ప్రభాకర్ రావు ఇచ్చిన నంబర్ల జాబితాను ఉన్నతాధికారులు యథావిధిగా ముందుకు పంపడం వెనుక ఉన్న ఒత్తిళ్లు లేదా ఉద్దేశపూర్వక సహకారంపై సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం సేకరించిన స్టేట్‌మెంట్లను అనుబంధ ఛార్జ్‌షీట్‌లో చేర్చడం ద్వారా ఈ కేసును మరింత పటిష్టం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.