శాంతి భద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించే విధంగా ప్రత్యేక శిక్షణ పొందిన 48 పోలీస్ జాగిలాలు ( వీటిని పోలీస్ భాషలో కెనెన్ అని పిలుస్తారు), 64 మంది జాగిలాల శిక్షకుల  పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.తెలంగాణా రాష్ట్రానికిచెందిన 36 , అరుణాచల్ రాష్ట్రానికి చెందిన జాగిలాలకు ఇప్పటికే శిక్షణ నిచ్చారు.  మొయినాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీలో నేడు జరిగిన పోలీస్ జాగిలాలు, ట్రైనర్ల  పాసింగ్ అవుట్ పరేడ్ ప్రత్యేకత సంతరించుకుంది.


మొయినాబాద్ శిక్షణా కేంద్రం లో ఈ 48 జాగిలాలకు ఎనిమిది నెలల పాటు, 64 మంది హాండ్లర్స్ లకు  (శిక్షకులు) ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఈ 48 జాగిలాలలో ఐదు రకాలు ప్రధానంగా  లెబ్రడాల్‌ 21, జర్మన్ షెప్పర్డ్ 1, బెల్జియం మాలినోస్ 21, కోకోర్ స్పానియల్ 4, గోల్డెన్‌ రిట్రీవర్ 1  జాతులకు చెందినవి వున్నాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జాగిలాలు, శిక్షకులు ఈ బ్యాచ్ లో ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కు చెందిన పీ.ఎం. డివిజన్ పోలీస్  కె-9 డివిజన్ కన్సల్టింగ్ డైరెక్టర్ డాక్టర్ ఫై.కె. ఛుగ్ ఈ బ్యాచ్ తుది పరీక్షకు ఎక్జామినర్ గా హాజరయ్యారు. జాగిలాలకు వాసన చూసె శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అధికంగా ఉంటుంది.
 విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయి.




ప్రపంచ వ్యాప్తంగా 435 రకాల శునక జాతులు ఉన్నాయి. చూసేందుకు అన్ని ఒకే పోలికతో ఉన్నప్పటికీ ఒక్కో జాతి శునకం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వీటిలో ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీస్‌ శాఖ తమ నేర పరిశోధనల అవసరాలకు వినియోగించుకుంటున్నది. తెలంగాణా రాష్ట్ర పోలీస్‌ శాఖ లెబ్రడాల్‌, డాబర్‌మెన్‌, ఆల్సీషియన్‌, గోల్డెన్‌ రిట్రీవర్‌, డాల్మేషన్‌, జర్మన్‌షపర్డ్‌ వంటి ఆరు రకాల జాతుల జాగిలాల సేవలను మాత్రమే వినియోస్తున్నది. ఇవి కాకుండా ఎయిర్‌ ఫోర్టులో తనిఖీల కోసం చిన్నవిగా వుండే కాకర్స్‌ స్పెనియల్ జాతి కుక్కలను పోలీసులు వినియోగిస్తున్నారు. మనుషులతో పోలీస్తే వివిధ జాతుల కుక్కలకు వాసన చూస్తే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అదికంగా కలిగివుంటాయి.




 


ఎనిమిది నెలల కఠోర శిక్షణ


హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో  పోలీస్ శాఖ అద్వర్యంలో  ఉన్నఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీలో పోలీస్ జాగిలాలకు కఠోర శిక్షణ ఇస్తున్నారు. తమకు అవసరమైన జాగిలాల గురించి ఆయా యూనిట్ల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తారు. ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ వింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో ఆయా యూనిట్లకు కావాల్సిన జాగిలం (స్నిఫర్‌ లేదా ట్రాకర్‌)ను తీర్చిదిద్దేందుకు మూడు నెలల వయస్సు కలిగిన కుక్క పిల్లలను అందుబాటులోని కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. దీనిని హ్యాండ్లింగ్‌ చేసేందుకు  ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్‌ను కేటాయిస్తారు.


 మొదటి నెలలో గ్రూమింగ్‌, వేళకు ఆహారం ఇవ్వడం ద్వారా యజమాని (హ్యాండ్లర్‌) పట్ల కుక్కకు ప్రేమ, ఆకర్షణ కలిగేలా చేస్తారు. ఈ సమయంలో కుక్క తన యజమానిని గుర్తించే స్థాయికి చేరుతుంది. నాలుగోనెల నుంచి ఐదో నెల వరకూ విధేయత, కూర్చోవడం, నిలబడడం, పడుకోవడం, సెల్యూట్‌ చేయడం వంటివి నేర్పిస్తారు. ఆ తర్వాత వాటికి ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణత పొందిన వాటికి ఐదు నెలల పాటు పేలుడు పదార్థాలను కనిపెట్టడం,  నిందితుల ఆచూకీలను కనిపెట్టడం, ఇతర అంశాల్లో పూర్తి స్ధాయి శిక్షణనిస్తారు.





క్రమం తప్పని దినచర్య
 


ఉదయం ఆరుగంటలకు క్యానల్‌లను స్థావరం నుంచి బయటకు వదులుతారు. ఎనిమిది గంటల వరకు రన్నింగ్‌, వ్యాయామంతో పాటు దైనందిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. అరగంట పాటు గ్రూమింగ్‌ (దువ్వడం) చేస్తారు. ఎనిమిదిన్నరకు ఆహారం ఇచ్చి తిరిగి క్యానల్‌లోకి పంపిస్తారు. మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర గంటల వరకూ తిరిగి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి.


ఎనిమిదేళ్లకే ఉద్యోగ విరమణ    


   సాధారణంగా శునకాల జీవిత కాలం 12 నుంచి 14 సంవత్సరాలు. పోలీస్‌ జాగిలాలకు ఎనిమిదేళ్లు నిండగానే ఉద్యోగ విరమణ చేయిస్తారు. ఎందుకంటే ఈ వయసుకు వచ్చే సరికి జాగిలాలలో వాసన పసిగట్టే శక్తి తగ్గిపోతుంది. పేలుడు పదార్థాలను గుర్తించే జాగిలాలు సాధారణం కంటే 40 రెట్లు ఎక్కువగా వాసన పీల్చుతాయి.


ఉద్యోగ విరమణ తర్వాత
      
ఉద్యోగ విరమణ చేసిన పోలీస్‌ జాగిలాలను వాటి హ్యాండ్లర్స్‌కు అప్పగిస్తారు. ఒక వేళ వీటిని పెంచుకునేందుకు వారు సమ్మతించకపోతే, ఎవరైనా జంతు ప్రేమికులు ముందుకు వస్తే పోలీసు ఉన్నతాధికారులు అన్ని విధాల పరిశీలించాక వారికి అప్పగిస్తారు. జంతు ప్రేమికులకు అప్పగించిన రెండు నెలల వరకు వాటి బాగోగులను, యజమానితో జాగిలాలు వ్యవహరిస్తున్న తీరును వాటి హ్యాండ్లర్లు తప్పని సరిగా పరిశీలిస్తారు



క్రమశిక్షణలో మేటి


      పోలీస్‌ శాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు. ఇందుకనుగుణంగానే జాగిలాలు కూడా క్రమశిక్షణను పాటిస్తాయి. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు, విచారకర సంఘటనలు జరిగినప్పుడు హ్యాండ్లర్‌ ఆదేశాల మేరకు ఈ జాగిలాలు ప్రవర్తిస్తాయి. సెల్యూట్‌ చేయడం, నిర్దేశించిన వాహనంలోకి, లేదా ప్రదేశంలోకి వెళ్ళేలా హ్యాండ్లర్‌ ఇచ్చిన ఆదేశాలను శిరసా వహిస్తాయి.


నేర పరిశోధనలో ఘనం


         ఇంటి యజమానుల పట్ల శునకాలు ఎంత విశ్వాసం చూపుతాయో.. పోలీస్‌ కేసుల పరిశోధనలో కూడా అంతే పాత్ర పోశిస్తున్నాయి. బందోబస్తు, దొంగతనాలు, హత్య కేసుల్లో నేరస్థుల కదలికలను గుర్తించడం, బాంబ్‌లు, ఇతర మందు సామగ్రిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నో కేసులను శునకాలు చేధించిన సందర్భాలు ఉన్నాయి.


అరుణాచల్ ప్రదేశ్ జాగిలాలకు కూడా శిక్షణ


        జాగిలాల శిక్షణలో జాతీయ స్థాయిలో పేరుగాంచిన మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12 జాగిలాలకు  ప్రత్యేక శిక్షణ అందచేశారు. గతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన శునకాలు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్,కర్ణాటక,ఉత్తర్ ప్రదేశ్,ఆంద్ర ప్రదేశ్ జాగిలాలకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. గతంలో, 2019 లో  ఇక్కడ శిక్షణ పొందిన  బీహార్ రాష్ట్రానికి చెందిన శునకాలు అక్రమంగా నిల్వ చేసిన మద్యం గుర్తింపు, అక్రమద్యం తయారీ కేంద్రాలను విజయవంతంగా గుర్తిస్తున్నాయని బీహార్ పోలీస్ శాఖ తెలిపింది.



అభినందించిన డీజీపీ అంజనీ కుమార్


      పోలీస్ శాఖలో అంతర్గత భాగమైన కె-9 జాగిలా వ్యవస్థలో భాగంగా మొయినాబాద్ ఐఐటిఏ లో 22 వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించడం పట్ల డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. ఈ షికాశానను విజయవంతముగా పూర్తిచేయడంలో కృషిచేసిన ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, ఇంటిజెన్స్ సెక్యూరిటీ విభాగం డీఐజీ టాఫ్సీర్ ఇక్బాల్, ఇతర అధికారులను ఆయన అభినందించారు.