Mallikarjun Kharge At Tukkuguda Meeting: బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని తెలంగాణ ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ.. యువత త్యాగాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రాంగా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో 3 లక్షల 66 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అదోగతిపాలు చేసిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో రాష్ట్ర ప్రజలపై అప్పుల బారం పెరిగిందని, కాంగ్రెస్ వస్తే పారదర్శక పాలన అందిస్తామని ఖర్గే అన్నారు.


2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తామని, వాటిని బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పిన మాటను మోదీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు చేసిన, హామీలు ఇచ్చిన మోసం చేసిన వారికి బుద్ది చెప్పాంటే తమకు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  గొప్పవాళ్లు బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని పారిపోతారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహకరిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.


మోదీ, కేసీఆర్ లు.. కేంద్రాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటూ దాచుకుంటున్నారని ఆరోపించారు. బయటకి మాత్రం తాము పోట్లాడుతున్నట్లు చూపించి, దోస్తీ కొనసాగిస్తున్నారని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రాజెక్టులలో అవినీతి జరుగుతుందని ప్రజలు గుర్తించాలని ప్రజలను ఖర్గే కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. సభకు విచ్చేసిన అశేష జనాన్ని, వారి ఉత్సాహాన్ని చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పక్ష ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తనకు నమ్మకం కలిగిందన్నారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా స్వప్నం - 6 గ్యారంటీ స్కీం‌లు ప్రకటించిన సోనియా


తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలు ఇవీ..
- మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
- రూ.500 లకే గ్యాస్ సిలిండర్
- తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- ఇళ్లులేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
- ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.
- రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
- వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్
- గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
- చేయూత పథకం ద్వారా వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛన్
- రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు