బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నిన్న (ఫిబ్రవరి 18) కన్నుమూసిన నటుడు తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మోకిలలోని ఆయన సొంత ఇంటికి తారకరత్న భౌతిక కాయాన్ని చేర్చారు. ఆయన్ను ఆఖరిసారి చూసేందుకు సీని ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.


తారకరత్న మృతిపై ప్రధాని కార్యాలయం ట్వీట్
నటుడు తారకరత్న మృతి తనను ఎంతో బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ‘‘సినిమాలు, ఎంటర్‌టైన్‌రంగంలో తారకరత్న తనదైన ముద్రవేశారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓంశాంతి’’ అని ట్వీట్‌ చేశారు.






తారకరత్న మరణంపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.






తారకరత్నకు ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు
మోకిలలోని సొంతింట్లో ఉన్న తారకరత్న భౌతికకాయం వద్దకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగివస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలచిందని వాపోయారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు.


తారకరత్న భౌతికకాయానికి కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ నివాళి
సినీ నటుడు తారకరత్న భౌతిక కాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ నివాళి అర్పించారు. మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న వారు పార్థివ దేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో ఎన్టీఆర్ మాట్లాడారు.