ప్రధాని నరేంద్ర మోదీ నేడు (సెప్టెంబర్ 24) 9 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. 11 రాష్ట్రాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. ఈ వందే భారత్ రైళ్ల ద్వారా, ఈ అన్ని రాష్ట్రాల్లో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా, ఈ 11 రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
కాచిగూడ - యశ్వంత్ పూర్
హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ వందేభారత్ రైలు నడుస్తుంది. హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంత్ పూర్ రైల్వేస్టేషన్ వరకూ రైలు సర్వీసు ఉంటుంది. కాచిగూడ - యశ్వంతపూర్ (20703) స్టేషన్ కు ఎకానమీ ఛైర్ కార్ లో క్యాటరింగ్ ఛార్జీతో కలుపుకొని రూ.1600గా నిర్ణయించారు. క్యాటరింగ్ ఛార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,225, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ లో ప్రయాణానికి క్యాటరింగ్ ఛార్జీతో కలుపుకొని రూ.2,915గా, కేటరింగ్ ఛార్జీ లేకుండా రూ.2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్లే 20704 రైలుకు మధ్య ధరల్లో స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఎకానమీ ఛైర్ కార్ లో కేటరింగ్ ఛార్జీలతో కలిపి రూ.1540, కేటరింగ్ ఛార్జీ లేకుండా రూ.1255, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ లో కేటరింగ్ ఛార్జీతో కలిపి రూ.2865, కేటరింగ్ ఛార్జీ లేకుండా రూ.2515గా నిర్ణయించారు.
విజయవాడ - చైన్నై మధ్య మరో వందేభారత్
విజయవాడ- చెన్నై మధ్య మరో వందేభారత్ రైలు కూడా ఉంది. ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణించి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 8 బోగీలతో ఉండే ఈ రైలు వారంలో 6 రోజులు ఉంటుంది. ఒక్క మంగళవారం మాత్రం ఈ రైలు నడవదు. సోమవారం (సెప్టెంబర్ 25) నుంచి ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
వందేభారత్ రైల్లో విజయవాడ నుంచి చెన్నైకి 6 గంటల 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభయ్యే ఈ రైలు రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఉదయం 7.05 గంటలకే చెన్నై నుంచి రేణిగుంట చేరుకుంటుంది. 8.39 గంటలకు నెల్లూరు, 10.09 గంటలకు ఒంగోలు, 11.21 గంటలకు తెనాలి చేరుకుంటుంది.
టికెట్ ధరలు ఇవీ
విజయవాడ నుంచి చెన్నైకి చైర్ కార్ ధర రూ.1420 కాగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2,690గా ఉంది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు చైర్ కార్ ధర రూ.1320 కాగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2,540గా ఉంది.