PM Hyderabad Visit: ఏప్రిల్ 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా కేంద్ర బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న వందేబారత్ సికింద్రాబాద్ నుండి తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్ ను ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం 10 నుండి ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఎస్పీజీ, ఎన్ఎస్జీ, డీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ మొదలైన కేంద్ర బలగాలు పెద్దఎత్తున చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రైల్వే స్టేషన్ వెనుకవైపు నుండి ఎవరిని అనుమతించడం లేదు. ప్రయాణికులను కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు వైపు నుండే లోనికి రావాలని సూచిస్తున్నారు. ప్రధాని రాక సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే శనివారం నాడు 10వ ప్లాట్ ఫాం, ట్రాక్ పై నుండి నడపాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కాబట్టి ప్రయాణికులు తాము ప్రయాణించే రైళ్లకు సంబంధించిన సమాచారం తెలుసుకొని స్టేషన్ కు చేరుకోవాలని, అంతే కాకుండా ఇబ్బందులను ముందే గ్రహించి స్టేషన్ కు కనీసం ఒక గంట ముందు చేరుకోవాలని సూచించారు. అలాగే తాము ప్రయాణం చేయాల్సిన రైలులో వీలైనంత త్వరగా ఎక్కి కూర్చోవడం ద్వారా సంతృప్తికరమైన ప్రయాణ అనుభూతిని పొందాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ టూర్ ఖరారైంది. వందే భారత్ రైలు ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్యన తిరిగే వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. ఇది దేశంలోని 13వ వందేభారత్ రైలు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ ట్రైన్ వల్ల ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8:30 గంటలకు తగ్గిపోతుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
అనంతరం రూ. 715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారు. ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్‌ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెన చేపడుతున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రేతిఫైల్ బస్ స్టేషన్ కు నేరుగా కనెక్టివిటీని పెంచుతారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వచ్చే/వెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాలను అభివృద్ధి పనులలో భాగంగా చేపడుతున్నారు.