Pista House Flight Restaurant: వివిధ రకాల థీమ్‌లతో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తుండడం ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. భోజనం రుచితో పాటు రెస్టారెంట్ వాతావరణం (యాంబియాన్స్) ఆకట్టుకునేలా చేసి భోజన ప్రియులను ఆకర్షించాలని యజమానులు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. గతంలో మనం ట్రైన్ థీమ్‌తో రెస్టారెంట్, ఆకాశంలో భోజనం చేసేలా ఏర్పాట్లు లాంటివి చూశాం. జైలు గదుల్లో కూర్చొని భోజనం చేసే అనుభూతిని కూడా కొన్ని రెస్టారెంట్లలో ఉంది. ఆ మధ్య విజయవాడలో ఓ పాత విమానాన్ని కొని అందులో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అలాంటి విమాన రెస్టారెంట్ ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ రెస్టారెంట్ సంస్థ అయిన పిస్తా హౌస్ ఈ ఫ్లైట్ రెస్టారెంట్‌ని మరికొద్ది రోజుల్లో ప్రారంభించనుంది.


హైదరాబాద్ నగర శివారులోని షామీర్ పేట్ ప్రాంతంలో ఫ్లైట్ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. అందుకోసం కొద్ది నెలల క్రితమే పిస్తాహౌజ్ యాజమాన్యం ఎయిర్ ఇండియా సంస్థ నుంచి మొట్టమొదటి ఎయిర్ బస్ - 320 పాత విమానాన్ని కొనేసింది. దాన్ని హైదరాబాద్‌కు తెచ్చేయడం కూడా పూర్తి అయిపోయింది.


‘‘మేం కొన్న ఎయిర్ బస్ ఏ 320 విమానం దేశంలోని ఆ తరగతికి చెందిన విమానాల్లో మొట్టమొదటిది. ఇప్పటికే దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేశాం. ప్రస్తుతం రినోవేషన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లో తొలి ఫ్లైట్ రెస్టారెంట్ ను ప్రారంభిస్తాం’’ అని పిస్తాహౌజ్ సంస్థ యజమాని అబ్దుల్ మాజిద్ తెలిపారు. విమానాన్ని తెచ్చే క్రమంలో ఏపీలోని ఓ చోట అండర్ పాస్‌లో ఇర్కుక్కోవాల్సి వచ్చిందని, కానీ, ఏపీ పోలీసులు, స్థానికుల సహకారంతో మరో దారిలో విమానాన్ని తరలించామని చెప్పారు. తీసుకొచ్చేటప్పుడు దాన్ని విడిభాగాలుగా తీసుకొచ్చామని చెప్పారు. కావాల్సిన ప్రదేశానికి తీసుకొచ్చాక ఆ భాగాలను బిగించామని చెప్పారు. వచ్చే నెలలో రెస్టారెంట్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.


ఎయిర్ పోర్ట్ తరహాలోనే అనుభూతి


‘‘హైదరాబాద్‌కు ఫ్లైట్ రెస్టారెంట్ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. హైదరాబాద్‌లో ఎప్పుడూ ఊహకందని ఆలోచనలతో ముందుకు వస్తుంటారు. ఇప్పుడు మేం నిజమైన విమానాన్ని ఫ్లైట్ రెస్టారెంట్ గా మార్చబోతున్నాం.


బోర్డింగ్ పాస్ తరహాలో టికెట్లు


విమాన రెస్టారెంట్ పరిసరాలు అచ్చం ఎయిర్‌పోర్టులా ఉండేలా డిజైన్ చేస్తున్నాం. ఈ ప్లేన్ కోసం మినీ రన్‌వేను కూడా తయారు చేశాం. రెస్టారెంట్ కు వచ్చేందుకు మేం ఇచ్చే టికెట్లు సేమ్ బోర్డింగ్ పాసుల్లాగానే ఉంటాయి. కస్టమర్లు సెక్యూరిటీ చెకప్ చేసుకొని ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది’’ అని అబ్దుల్ మాజిద్ చెప్పారు.


ఖర్చు ఎంత అవుతోందంటే..


పిస్తాహౌజ్ నుంచి ఈ ఫ్రాంఛైసీ తీసుకున్న ఓనర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘మేం ఈ పాత విమానాన్ని 75 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాం. ఇంకో రూ.30 నుంచి 40 లక్షల వరకూ ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని చెప్పారు.