Sigachi Blast Incident: పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ దుర్ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబు రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. జూన్ 30న ప్రమాదం సంభవించగా.. నేటికి ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి న్యాయం జరగలేదన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయిల పరిహారం విషయంలో క్లారిటీ లేదని పిల్ లో పేర్కొన్నారు. సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన కేసు విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని తన వ్యాజ్యంలో పిటిషనర్ కోరారు.
పిటిషనర్ సిగాచీ ఘటన(Sigachi Incident)పై తన వ్యాజ్యంలో ఏ పేర్కొన్నారంటే..సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, సుల్తాన్‌పూర్ గ్రామంలోని పాశమైలారం వద్ద ఉన్న సిగాచీ ఫ్యాక్టరీలో ఈ ఏడాది జూన్ 30న ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సైతం ప్రకటించిన పరిహారాన్ని ఇంకా అందజేయలేదు. దాంతో వారికి న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. ఈ పేలుడులో మృతదేహాలు లభ్యం కాని 8 మంది కార్మికులు కూడా ఉన్నారు.
పటాన్‌చెరు మండలం, సుల్తాన్‌పూర్ లోని పాశమైలారంలో ఉన్న సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన సమయంలో 143 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారు. వారిలో 61 మంది సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. 46 మంది కార్మికులు మరణించినట్లు ప్రకటించగా, మరో 8 మంది కార్మికుల మృతదేహాలు లభ్యం కాలేదు. దాంతో మృతుల సంఖ్యను 54గా పరిగణించారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాలలో కొందరికి రూ. 1 లక్ష మధ్యంతర పరిహారం, గాయపడిన కార్మికులలో కొందరికి రూ. 50,000, మృతదేహాలు లభ్యం కాని కార్మికుల కుటుంబాలకు రూ. 15,00,000 చెల్లించారు. అయితే ప్రమాదానికి సంబంధించి మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి నేటికి పూర్తి పరిహారం అందలేదు. పరిహారం గురించి ఎటువంటి సమాచారం లేదు. ఈ ప్రమాదంలో మరణాలకు సంబంధించి కేసులో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.
పిటిషనర్ వివరాలు: పిటిషనర్ 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యావరణ న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబు రావు ఉన్నారు. 100 కంటే ఎక్కువ EIA నివేదికలను పద్ధతిలో విమర్శించడం ద్వారా, పిటిషనర్ నిపుణుల అంచనా వ్యవస్థలో కాపీరైట్, వ్యవస్థాగత వైఫల్యాలను బహిర్గతం చేశారు. అతని చర్యలకు రెండు రాష్ట్రాల హైకోర్టులు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ముందు చట్టపరమైన పోరాటాలలో ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చింది. పిటిషనర్ గతంలో వాతావరణ మార్పుతో సహా కీలకమైన పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచారు. LG పాలిమర్స్ స్టైరిన్ లీక్ విశ్లేషణలో సైతం పాల్గొన్నారు.
పిటిషనర్ శాస్త్రవేత్తలు, విద్యావేత్తల సహకార నెట్‌వర్క్ అయిన "సైంటిస్ట్స్ ఫర్ పీపుల్" అనే గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పని ప్రదేశాలలో ప్రధాన ప్రమాదాలకు కారణాలను పరిష్కరించడంలో వారి గ్రూప్ కీలకపాత్ర పోషించింది. భోపాల్, పంజాబ్‌లోని పర్యావరణ న్యాయ పోరాటాలకు సహాయం అందించింది. ఆగస్టు 2024లో సంగారెడ్డి జిల్లాలోని SB ఆర్గానిక్స్ లిమిటెడ్‌లో జరిగిన రియాక్టర్ పేలుడు కారణాలపై నియమించిన నిపుణుల కమిటీలో పిటిషనర్ సభ్యుడిగా ఉన్నారు. సిగాచీ ఘటనలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.