Telangana Latest News : తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల వివాదంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. బదులుగా ఫోర్త్ సిటీలో కాంట్రాక్ట్‌లు దక్కాయని దుయ్యబట్టారు.
చాలా కాలంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఓ బీజేపీ ఎంపీ కీలక పాత్ర పోషించారని కేటీఆర్ ఆరోపిస్తూ వచ్చారు. సమయం వచ్చినప్పుడు ఆ ఎంపీ పేరు చెబుతానంటూ తెలిపారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల అమ్మకం, తాకట్టు విషయంలో సీఎం రమేష్ సహకరించారని అన్నారు. కమీషన్లు ఇప్పించి రేవంత్ రెడ్డికి సహాయం చేశారని విమర్శించారు.
కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తనకు సహాయం చేసిన సీఎం రమేష్‌కు ఫోర్త్ సిటీ కాంట్రాక్ట్‌లు దక్కాయని కేటీఆర్ ఆరోపించారు. ఫోర్త్ సిటీలో 1600 కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్ట్‌ను సీఎం రమేష్ కంపెనీకి కట్టబెట్టారని తెలిపారు. బీజేపీ ఎంపీకి ఇంత భారీగా లబ్ధి చేస్తుంటే కాంగ్రెస్ అధినాయకత్వం, అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే అన్నారు.
ఓవైపు బీజేపీ నాయకులకు లబ్ధి చేకూరుస్తూనే మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సోనియాగాంధీ లేఖ రాశారని ఉబ్బితబ్బిబైపోతున్న రేవంత్ రెడ్డికి కనీసం చదవడం కూడా రాదని ఎద్దేవా చేశారు. ఆ లెటర్‌లో ఏముందో కూడా తెలియకుండా సోనియా తనను పొగిడారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రేవంత్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాను రాలేనంటూ మాత్రమే సమాచారం ఇచ్చారని అన్నారు. దాన్ని అర్థం చేసుకోలేక ఏదో పొగిడినట్టు భ్రమపడుతున్నారని, ఆయన్ని చూస్తే జాలేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ఘటన చూస్తుంటే రేవంత్ రెడ్డిది దొంగడిగ్రీ ఏమో అన్న అనుమానం కలుగుతుందని అన్నారు.
పార్టీ నేతలనే కాకుండా తెలంగాణలోని అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు కేటీఆర్. అంతులేని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా నిలువునా ముంచేశారని అన్నారు. ఏడాదిలో లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేడు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల నియామక పత్రాలు అందజేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాటినే తామే భర్తీ చేశామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదనని అందుకే ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు కేటీఆర్. పాలకులు చెప్పారని పోలీసులు కేసులు పెడితే భవిష్యత్‌లో ఇబ్బంది పడతారని కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చట్టవిరుద్ధమైన పనులు చేయొద్దని హితవు పలికారు.