Phone Tapping Case -14 days remand for Radha Kishan Rao: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్ విధించారు. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ ఎదుట రాధాకిషన్ రావును బంజారా హిల్స్ పోలీసులు హాజరు పరచగా 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు (మార్చి 29న) తొలిసారిగా స్పందించారు. ఫోన్ల సంభాషణ విన్నామంటూ కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, ఆయన చర్లపల్లిలో చిప్పకూడు తినడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


పోలీసుల కస్టడీకి తిరుపతన్న, భుజంగరావు
ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలు అనుసరించి భుజంగరావు, తిరుపతన్నలను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిందితులు ఇద్దర్నీ చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ విచారణ చేయనున్నారు. భుజంగరావు, తిరుపతన్నలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేతల ఫోన్ల ట్యాపింగ్, నేతల ఫోన్ కాల్స్ సంభాషణలపై ఆరా తీస్తున్నారు. రాధాకిషన్ అరెస్ట్ తో కలిపితే ఈ కేసులో నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది.


ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో మొదట మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు ను అరెస్ట్ చేసింది. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి ఎన్నికల సంబంధిత, వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టారని అభియోగాలున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డు చేసిన హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావును విచారించగా.. అతను ఇచ్చిన సమాచారంతో మరికొందరి అరెస్టులు జరుగుతున్నాయి. తరువాత భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందం మార్చి 28న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.