Telangana News Today | హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు పీఎస్‌లో లొంగిపోయారు. ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. ప్రభాకర్ రావును కొన్ని గంటలపాటు విచారించనున్నారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట ఎస్ఐబీ మాజీ చీఫ్ ను హాజరు పరచనున్నారు.

Continues below advertisement

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. దర్యాప్తులో కీలక పరిణామాలుతెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్ష నాయకులు, నటీనటులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలతో సహా పలువురి ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ అధికారులు ప్రవీణ్ రావు, నల్లమాసు శివశంకర్, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న వంటి కీలక పోలీసు అధికారులను అరెస్ట్ చేసి విచారించారు. ఈ పోలీస్ అధికారులు తమ అధికార పరిధిని దుర్వినియోగం చేస్తూ రాజకీయ నాయకుల ఆదేశాల మేరకే ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుపై దృష్టిఈ కేసులో అత్యంత కీలకమైన నిందితుడు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుపైనే ప్రస్తుతం దర్యాప్తు కేంద్రీకృతమై ఉంది. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చి పలుమార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ దశలో అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ, ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని, ముఖ్యంగా డిజిటల్ సాక్ష్యాలు ఉన్న ఐక్లౌడ్ అకౌంట్ పాస్‌వర్డ్‌లు ఇవ్వడానికి నిరాకరించి, సాక్ష్యాలను ధ్వంసం చేశారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.

Continues below advertisement

సుప్రీంకోర్టు కీలక ఆదేశంనిందితుడు ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదన్న వాదనలు, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు కల్పించిన అరెస్ట్ రక్షణను తొలగించి, వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (సిట్) ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. ప్రభాకర్ రావు లొంగిపోయిన తర్వాత ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకుండా, చట్ట ప్రకారమే విచారణ చేయాలని సిట్‌ను కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం ఈ కేసు దర్యాప్తులో ఒక పెద్ద మలుపుగా పరిగణించబడుతోంది.

రాజకీయ కోణాలు, దర్యాప్తు పురోగతిప్రస్తుత దర్యాప్తులో భాగంగా అరెస్టయిన అధికారులు తమ వాంగ్మూలాలలో గత సీఎంఓలోని కొంతమంది పెద్దల ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు, అక్రమ నిఘా, బెదిరింపులు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం వంటి అభియోగాలు నమోదయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పదేళ్లుగా ఓఎస్‌డీగా పనిచేసిన పీ. రాజశేఖర్ రెడ్డి వంటి ఇతరులను కూడా సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్ రావు లొంగిపోయి కస్టడీ విచారణకు సహకరిస్తే, ట్యాపింగ్ నెట్‌వర్క్ డొంక మరింత కదిలి, ఈ వ్యవహారంలో ఉన్నతస్థాయి రాజకీయ ప్రముఖుల పాత్రలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర పోలీసుల పని తేలిక చేసింది.