హైదరాబాద్ మెట్రోలో సోమవారం మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన పసిబిడ్డను ఎత్తుకొని మెట్రో రైలులో కింద కూర్చోవడం అందర్నీ కలచివేసింది. పక్కనే యువతులు, యువకులు సీట్లలో కూర్చొని ఉన్నా సరే.. కింద పసి బిడ్డతో కూర్చున్న ఆ తల్లికి కనీసం ఒక్కరు కూడా సీటును ఆఫర్ చేయలేదు. అసలు మెట్రో రైలులో ప్రాథమిక నిబంధనే అది. గర్భిణీలు, పసిబిడ్డలతో ఉన్న మహిళలు, వయసు పైబడిన వారు, దివ్యాంగులు వంటి వారికి తాను కూర్చున్న సీటును ఆఫర్ చేయాలి. కానీ, సోమవారం నాడు మెట్రో రైలులో జరిగిన ఈ ఘటనలో కనీసం ఒక్కరు కూడా సంస్కారం ప్రదర్శించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పసికందును ఎత్తుకొని మెట్రో రైలు ఎక్కింది ఆ మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోవడంతో ఎక్కడా కూర్చునే అవకాశమే లేకుండా పోయింది. కదిలే రైలులో పసిబిడ్డతో ఎక్కువ సేపు నిలబడలేక రైలులోనే సీట్ల పక్కన కూర్చుంది. పక్కనే సీట్లలో యువతులు, మహిళలే ఎక్కువగా కూర్చొని ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను చూసి ఎవరికీ దయ కలగలేదు. కింద కూర్చుని.. ఒళ్లో బిడ్డను ఉంచుకుని గమ్యం వరకూ ప్రయాణించింది. హైదరాబాద్ మెట్రోలో జరిగిన సంఘటనను ఎవరో వీడియోతీసి ‘గ్రేట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ హైదరాబాద్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మెట్రోరైలులో అక్కడ ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవటం.. బాలింత అనే కనికరం చూపకపోవటంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్దచదువులు పూర్తిచేసిన మహిళలు.. కనీస మానవత్వం చూపకపోవటం వారి సంస్కార హీనానికి నిదర్శనమని కామెంట్లు చేశారు.
Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్!
స్పందించిన మెట్రో ఎండీ
మెట్రో రైలులో జరిగిన ఘటనపై హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ‘‘ఈ పరిణామం చాలా బాధాకరం. తోటి ప్రయాణికులు సీటిచ్చి ఆ తల్లికి సహకరించాల్సి ఉంది. అలా చేయకపోవటం బాధగా అనిపించింది. మనం కట్టుబడి ఉన్న సామాజిక విలువలను ప్రశ్నించేదిగా ఈ ఘటన ఉంది. పసికందును భద్రంగా పట్టుకుని కిందకూర్చుని ప్రయాణించిన ఆమెలో నిజమైన భారతీయ మాతృ హృదయ గొప్పతనం కనిపించింది’’ అని స్పందించారు.
అర్హులకు సీటివ్వకపోతే ఇలా చేయండి
మెట్రో రైళ్లలో వయసు పైబడిన వారికి, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లు ఉంటాయి. ఆయా సీట్లలో వారు కూర్చొవడానికి మాత్రమే అర్హులు. ఆ సీట్లలో ఎవరైనా యువకులు కూర్చొని ఉంటే వారిని లేపి కూర్చొనే అధికారం పెద్దవారికి, మహిళలకు లేదా దివ్యాంగులకు ఉంటుంది. ఒకవేళ ప్రశ్నించినా సీట్ల నుంచి లేవకపోతే అక్కడే ప్రదర్శితమై ఉండే వాట్సప్ నెంబరుకు ఫిర్యాదు చేయడం ద్వారా తర్వాతి స్టేషన్‌లో మీరు ఉన్న చోటికి మెట్రో సిబ్బంది వచ్చి సీటును కేటాయిస్తారు.
Also Read: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!