Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో  లిఫ్ట్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న అపార్టమెంట్‌ల సంస్కృతిలో నాసిరకం లిఫ్టులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. పదిహేను రోజుల వ్యవధిలోనే ఇలా లిఫ్టులో ఇరుక్కొని బాలుడు చనిపోవడం ఇది రెండో దుర్ఘటన. 


మెహదీపట్నంలోని సంతోష్‌నగర్‌కాలనీలో దుర్ఘటన జరిగింది. ఆరు అంతస్తుల ముజ్తాబా అపార్ట్‌మెంట్‌ లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. దీనికి వాచ్‌మెన్‌గా ఉన్న శ్యామ్‌ బహదూర్‌ అనే వ్యక్తి కుమారుడే నాలుగేళ్ల సురేందర్. రాత్రి పది గంటల సమయంలో ఆడుకుంటూ లిఫ్ట్‌ వద్దకు చేరుకున్నాడు. డోర్స్ తీసి ఉండటంతో అందులోకి వెళ్లాడు. ఇంతలో లిఫ్ట్ పైకి వెళ్లింది.  


తలుపుల మధ్యలో బాలుడు ఉన్న విషయం తెలుసుకోకుండా పై అంతస్తులో ఉన్న వాళ్లు లిఫ్టు కోసం నొక్కడంతో పైకి వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ డోర్స్ మధ్యన ఉన్న బాలుడు నలిగిపోయాడు. ఎప్పటి నుంచో బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వెతకడం ప్రారంభించారు. 


నాలుగేళ్ల సురేందర్ కోసం వెతుకుతున్న క్రమంలో లిఫ్ట్‌లో రక్తపు మడుగులో ఉన్న బాలుడు కనిపించాడు. దాన్ని సూచిన తల్లిదండ్రులు అపార్టమెంట్‌వాసులు షాక్ తిన్నారు. బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కొని చనిపోయిన సంగతి గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


మాంసం ముద్దై లిఫ్టులో వేలాడుతున్న కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు రోదన అక్కడి వారిని కలిచి వేసింది. అప్పటి వరకు కళ్లముందే ఆడుతున్న బాలుడు ఒక్కసారిగా ఇలా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. 


ఈ ఫ్యామిలీ ఏడు నెలల క్రితమే హైదరాబాద్ వచ్చారు. వాస్తవంగా వీళ్లది నేపాల్. గతంలో వేరే ప్రాంతంలో వాచ్‌మెన్‌గా ఉండే వాడు. మూడు నెలల క్రితమే ఇక్కడ పనిలో చేరాడు. ఇతనికి ఇద్దరు సంతానం. మొదటి సంతానం కుమార్తె. రెండో సంతానం కుమారుడు.  


ఫిబ్రవరి 21న లిఫ్టులో ఇరుక్కొని బాలుడు మృతి 


గత నెలలో కూడా నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. శాంతినగర్‌లోని హాకీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న మఫర్ అపార్ట్‌మెంట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అర్నవ్ అనే ఐదేళ్ల బాలుడు నాలుగో అంత‌స్తులో ఉండగా లిఫ్టులో ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. అదే టైంలో నాంపల్లి ఎమ్మెల్యే మహ్మ‌ద్ మజీద్ హుస్సేన్ కూడా అక్కడు వచ్చారు. అంతా కలిసి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది.  


ఇలా రెండు వారాల వ్యవధిలోనే రెండు లిఫ్టు ప్రమాదాలు జరగడంతో తల్లిదండ్రులు, అపార్టమెంట్ వాసులు భయపడిపోతున్నారు.