Numaish Exhibition 2025 : హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్లో సందర్శకులకు భయానక అనుభవం ఎదురైంది. దాదాపు అరగంట పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిలుపుకున్నారు. ఓ అమ్యూస్మెంట్ రైడ్(Amusement Ride) కు వెళ్లిన ప్రయాణికులు తలకిందులుగా ఇరుక్కుపోవడంతో భయాందోళనకు గురయ్యారు. విషయం గమనించిన సిబ్బంది దాదాపు అరగంట పాటు శ్రమించి రైడ్‌లో తలకిందులుగా చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రాణ భయంతో కేకలునాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం తప్పింది. నుమాయిష్‌కు వచ్చిన కొందరు సందర్శకులు ఎంతో సరదాగా అమ్యూజ్‌మెంట్ రైడ్‌కు వెళ్లారు. కానీ కొంత సమయానికే అకస్మాత్తుగా ఈ రైడ్ ఆగిపోవడంతో అందులో ఉన్న సందర్శకులు తలకిందులుగా ఉండిపోయారు. ఏం జరుగుతుంతో అర్థం కాగా, అది కూలి కిందపడుతుందేమోనని ప్రాణ భయంతో సందర్శకులు గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన నిర్వాహకులు సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. వారు కొంతసేపు శ్రమించి సమస్యను గుర్తించి అంతా క్లియర్ చేశారు. అమ్యూజ్‌మెంట్ రైడ్‌ ను తిరిగి ప్రారంభించగా అందులో ఉన్న సందర్శకులు కిందకి చేరుకున్నారు. కానీ దాదాపు 25 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడటంతో వారికి భయానక అనుభవం ఎదురైంది. 

ఈ ఘటనపై నుమాయిష్ నిర్వాహకులను Siasat సంప్రదించగా.. అమ్యూజ్‌మెంట్ రైడ్ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా మధ్యలోనే నిలిచిపోవడంతో అందులోని సందర్శకులు తలకిందులుగా అయ్యారని నిర్వాహకులు తెలిపారు. బ్యాటరీలో తలెత్తిన సమస్య కారణంగానే రైడ్ మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. సమస్యపై సమాచారం అందిన వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి బ్యాటరీలు మార్పించగా.. రైడ్ కంటిన్యూ అయిందని చెప్పారు. ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని, గాయాలు కాలేదన్నారు. కానీ ఆ అరగంట సమయం మాత్రం అందులోని సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వచ్చింది. ఇలాంటి రైడ్స్ విషయంలో నిర్వాహకులు మరింత జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉందని సందర్శకులు హెచ్చరిస్తున్నారు.

నుమాయిష్ సందర్శన వేళలు, టికెట్ ధరనాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి సురేందర్ రెడ్డి సియాసత్‌తో మాట్లాడుతూ.. నుమాయిష్ టికెట్ ధర రూ.40 నుండి రూ.50కి పెరిగింది.  జనవరి 2023లో చివరగా టికెట్ ధర రూ.10 మేర పెంచినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నుమాయిష్  సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 4:00 నుంచి రాత్రి 10:30 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో అయితే సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 11 వరకు నుమాయిష్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ డిమాండ్ పెరిగితే, అవసరాలకు అనుగుణంగా టైమింగ్స్ మార్చడంపై యోచిస్తామని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 15 వరకూ నుమాయిష్ ప్రదర్శన ఉండనుంది. 1938లో నిజాం కాలం నుంచి మొదలైన నుమాయిష్‌కు దేశ వ్యాప్తంగా ఆధరణ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ దాదాపు 2,400కు పైగా స్టాల్స్ ఒకే దగ్గర ఉండటంతో పాటు రూ.10 నుంచి లక్షల రూపాయల విలువైన వస్తువులు లభిస్తాయి. హ్యాండ్ క్రాఫ్ట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర రాష్ట్రాల్లో పండే స్పెషల్ ఫ్రూట్స్ ఇలా ఎన్నో లభిస్తాయి. 

Also Read: Hyderabad Gun Firing News:ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌