నిజామాబాద్ ఉగ్ర కుట్ర కోణం కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కీలక వ్యక్తి మౌసమ్ మహమ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటూ కర్ణాటకకు మకాం మార్చారు. సొంత స్థలం ఏపీలోని నంద్యాల. నిజామాబాద్ పీఎఫ్ఐకి ఆయుధాల శిక్షకుడిగా మహమ్మద్ ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. కర్ణాటకలో తప్పుడు పత్రాలతో మహమ్మద్ నివసిస్తున్నట్లుగా గుర్తించారు. యువతని ఉగ్ర వాదం వైపు తీసుకువెళ్లి మహమ్మద్ ఆయుధాల శిక్షణ ఇస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర పీఎఫ్ఐకి ఇన్చార్జిగా మహమ్మద్ పనిచేస్తున్నాడు. నిజామాబాద్‌ రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు మరో కేసు నమోదు చేసి, పీఎఫ్‌ఐపై దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్‌ చేయగా.. అందరిపైనా ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారు ఇచ్చిన సమాచారంతో తాజాగా యూనస్‌ను కర్ణాటకలో ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.  

మహమ్మద్ గతంలో నంద్యాలలో తన సోదరుడికి చెందిన ఇన్వర్టర్‌ షాపులో పని చేశాడు. 2022 సెప్టెంబరులో ఎన్‌ఐఏ సోదాల సమయంలో భార్య పిల్లలతో కలిసి కర్ణాకటకలోని బళ్లారికి పారిపోయాడు. అక్కడ తన పేరును బషీర్‌గా మార్చుకుని చెలామణి అయ్యాడు. ప్లంబర్‌గా పని చేస్తూ ప్రత్యేక కోడ్‌ భాషలో ఉగ్రవాద నేతలతో సంభాషణలు చేసేవాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. తాజాగా పక్కా సమాచారంతో మహమ్మద్ ను అరెస్టు చేశారు. షేక్‌ ఇలియాస్‌ అనే మరో వ్యక్తితో కలిసి తెలుగు రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు నిందితుడు ఎన్‌ఐఏ అధికారుల ముందు అంగీకరించాడు. ప్రస్తుతం ఇలియాస్‌ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.

గత ఏడాది సెప్టెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో ఎన్ఐఏ సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాలే కాక, దేశ వ్యాప్తంగా ఉన్న పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. యూపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్యకలాపాలపై సోదాలు చేశారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐకి చెందిన సుమారు 100 మంది ప్రముఖులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు ఏపీలోని కర్నూలు, గుంటూరులో తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తుల నివాసాలపైనా దాడులు చేశారు అధికారులు. రెండు రోజుల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురిని అదుపులోకి తీసుకుని వారిని హైదరాబాద్ కు తీసుకువచ్చి ఇక్కడ వారిని ప్రశ్నించారు. 

గతేడాది ఆగస్టులో ఆర్మూర్ లో సోదాలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎన్ఐఏ బృందం సోదాలు కొనసాగిస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు జరిపి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నుంచి నిధుల రాకపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జియాయత్ నగర్‌కు చెందిన నవీద్ ఓ చికెన్ సెంటర్ లో పని చేసేవాడు.  అతడికి పాకిస్థాన్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని.. దాంతో పాటు నిధులు అందుతున్నాయని ఎన్ఐఏ అప్పట్లో అనుమానం వ్యక్తం చేసింది.