New Aasara Pensions: స్వాతంత్ర్య వ్రజోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. 76వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకల సందర్భంగా 57 ఏళ్లు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదండోయ్ వాటిని పంద్రాగస్టు నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,46,117 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కానున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా.. కొత్త వారితో కలిపి ఈ సంఖ్య 45.41 లక్షలకు పెరగనుంది. కొత్త దరఖాస్తుదారులకు పింఛన్ చెల్లించాలంటే నెలకు రూ.62 కోట్ల వరకు కావాల్సి ఉంటుందని అంచనా. 57 ఏళ్లు పూర్తి అయిన వారి దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటే రూ.158 కోట్లో కావాలి. 


అయితే కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ పంద్రాగస్టు నుంచే ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పింఛన్ గుర్తింపు కార్డులను అందేస్తున్నారు.  


పింఛను గుర్తింపు కార్డుల అందజేత..!


ఈ పంపిణీ కార్యక్రమం ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని తెలిపిన ప్రభుత్వం.. ఆసరా పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయబోతుంది. రాష్ట్రంలో 57 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామంటూ పేదలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 57 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు మంత్రి ఈ సందర్భంగా పింఛను గుర్తింపు కార్డులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈనేపథ్యంలో మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌ మరోసారి నిరుపేదల ఆత్మ బంధువు అని నిరూపించుకున్నారని తెలిపారు.


డయాలసిస్ రోగులకు కూడా పింఛన్లు..!


అలాగే డయాలసిస్ రోగులకు కూడా పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వివరించారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డాయలసిస్ రోగులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో పాటు ఆసరా కార్డు కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. బోదకాలు బాధితులు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2,016 చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. 


Also Read: KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్ 


Also Read: PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!