రోజూ ఏదో ఒక అంశంపై ప్రధాని మోదీ లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ట్వీట్లు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు కూడా మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై ప్రసంగిస్తూ మహిళల గౌరవం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మన దేశ అభివృద్ధికి మహిళలను గౌరవించడం ఎంతో అవసరమని మోదీ పిలుపునిచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కేటీఆర్ కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.


మీరు అన్నట్లుగా నిజంగా మహిళలపై మీకు గౌరవం ఉంటే గుజరాత్ లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేసేలా ఉత్తర్వులిచ్చారు. వాటిని వెనక్కి తీసుకోండి. సర్, MHA ఆర్డర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం బాగా వికారంగా ఉంది. ఈ విషయంలో మీరు చిత్తశుద్ధి చూపాలి.’’


‘‘సర్, అంతేకాకుండా ఇండియన్ పీనల్ కోడ్ - ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ) లో రేపిస్టులకు బెయిల్ రాకుండా అవసరమైన సవరణలు చేయాలి. బలమైన చట్టాలు ఉండడమే.. న్యాయవ్యవస్థ ద్వారా త్వరగా న్యాయం అందుతుందనడానికి ఏకైక మార్గం’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.






మోదీ ప్రసంగంలో మహిళల గురించి వ్యాఖ్యలివీ..
భారత దేశ వృద్ధికి మహిళలను గౌరవించటం ఎంతో అవసరమని మోదీ అన్నారు. ‘‘మన నారీ శక్తికి అండగా ఉండటం మన బాధ్యత’’ అని చెప్పారు. ‘‘మహిళలను కించపరచటం మానేయండి’’ అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు ప్రధాని. భారత్‌లో మహిళలు ఇప్పటికే ఎన్నో అవమానాలు భరించారని, భారతీయులంతా కలిసి ఈ ఆలోచనను నిర్మూలించాలని సూచించారు. ‘‘మాటలు కానీ, మన ప్రవర్తన కానీ వారిని అవమానపరిచే విధంగా ఉండకూడదు. వాళ్లు తక్కువ అనే భావన కలగకుండా మనం నడుచుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రజల ఐకమత్యం ‘‘భిన్నత్వం’’లోనే ఉందని అన్నారు. ‘‘ఈ ఐక్యతను కోల్పోకుండా ఉండాలంటే తప్పకుండా లింగ సమానత్వం సాధించాలి. కూతుళ్లను, కొడుకులను ఒకే విధంగా చూడకపోతే, ఐక్యత ఎప్పటికీ సాధించలేం’’ అని స్పష్టం చేశారు.


స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడారు..


స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన మహిళలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. "భారత్‌లోని నారీశక్తిని తలుచుకుంటే ప్రతి ఒక్కరి గుండె ఉప్పొంగుతుంది. రాణీ లక్ష్మీబాయ్, జల్కారీ బాయ్, చెన్నమ్మ, బెగున్ హజ్రత్ మహల్..ఇలా మహిళలు స్వాతంత్య్రం కోసం పోరాడారు" అని చెప్పారు. నిజానికి ప్రధాని చేసిన వ్యాఖ్యలు...పరోక్షంగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్‌ను ఉద్దేశించేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ అధిర్ రంజన్ "రాష్ట్రపత్ని" అని పలికారు. దీనిపై పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది భాజపా. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టు పట్టింది. రాష్ట్రపతిని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు నాలుగు రోజుల పాటు భాజపా, కాంగ్రెస్ మధ్య ఈ అంశంపైనా వాగ్వాదం జరిగింది. చివరకు అధిర్ రంజన్ క్షమాపణ చెప్పారు. పొరపాటున నోరు జారారని వివరణ ఇచ్చారు. అక్కడితో ఆ వివాదం ముగిసిపోయింది. ఆ సమయంలో ప్రధాని మోదీ స్పందించలేదు. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 


గుజరాత్ లో కేసు ఏంటంటే..



గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానో అనే మహిళను, 2002 గోద్రా అల్లర్ల సమయంలో కొంత మంది సామూహిక అత్యాచారం చేశారు. అప్పుడు ఆమెకు 19 ఏళ్లు. తన రెండేళ్ల కూతురితో పాటు మరో 14 మంది బంధువులను కూడా నిందితులు చంపేశారు.




ఆ బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఒకరైన రాధేశ్యాం షాహా, 15 ఏళ్లు జైలులో ఉన్నందున శిక్షను తగ్గించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. సుప్రీం కోర్టు సూచన మేరకు పంచమహాల్ జిల్లా కలెక్టర్ సుజల్ మాయాత్ర నేతృత్వంలో గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. బిల్కిస్ బానో కేసు జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కమిటీ సలహా మేరకు వారిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.