Nikitha Godishala Murder Case: అమెరికాలో సాఫ్ట్‌వర్‌ ఇంజినీర్ చేతిలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్‌కు చెందిన తెలుగు యువతి నిఖిత కేసులో అత్యంత కీలక పరిణామ చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నిందితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మను తెలంగాణ పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అరెస్టు చేశారు. స్థానిక పోలీసుల సమన్వయంతో జరిపిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా, భారత్ అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నిందితుడిని అమెరికా అధికారులకు అప్పగించేందుకు అవసరమైన అధికార ప్రక్రియను హైదరాబాద్‌ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి. 

Continues below advertisement

హత్యకు దారి తీసిన కారణాలు!

హైదరాబాద్‌లోని లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ కుమార్తె నిఖిత ఎంఎస్‌ చదివేందుకు నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ నిఖిత, గత నాగులేళ్లుగా అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలన్న ఆమె కలను విధి కబళించింది. 

ఈ కేసులో నిందితుడైన అర్జున్ శర్మ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. అతను నిఖితకు మాజీ ప్రియుడు. అమెరికాలో నిఖిత ఎల్లికాట్ సిటీలో నివసిస్తుండగా, అర్జున్‌ శర్మ మేరీల్యాండ్‌లోని కొలంబియాలో నివసించేవాడు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా ఆర్థిక పరమైన వివాదాలు నడుస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిఖిత వద్ద అర్జున్ శర్మ అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా నిఖిత అడిగినందుకు ఆమెను హత్య చేశాడని నిఖిత తండ్రి ఆనంద్ ఆరోపించారు. 

Continues below advertisement

డిసెంబర్‌ 31, 2025న తాను తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటూ నిఖితను పిలిచి అర్జున్ శర్మ హత్య చేశాడు. ఆర్థిక వివాదమే ఈ దారుణ హత్యకు కారణమని అమెరికా అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

అమెరికా నుంచి పలాయనం 

హత్య చేసిన అనంతం నిందితుడు అర్జున్ శర్మ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత, అనగా 2026 జనవి 2న నిఖిత కనిపించడం లేదంటూ తనే స్వయంగా అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా గట్టుచప్పుడు కాకుండా భారత్‌ వచ్చేశాడు. 

నిఖిత అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ శర్మ హడావుడిగా దేశం విడిచి వెళ్లిపోవడంతో అమెరికా పోలీసులకు బలమైన అనుమానం కలిగింది. దీంతో జనవి 3న మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ నిఖిత మృతదేహం కుళ్లిపోయి స్థితిలో లభ్యమైంది. శరీరంపై ఉన్న కత్తిపోట్ల గాయాలను బట్టి ఆమెను హత్య చేసినట్టు హోవార్డ్‌ కౌంటీ పోలీసులు నిర్దారించారు. ప్రాథమిక విచారణలో డిసెంబర్‌ 31నే ఆమె హత్య జరిగినట్టు నిర్దారించిన అమెరికా పోలీసులు ఈ విషయాన్ని భారత్‌లోని నిఖిత కుటుంబానికి సమాచారం అందించారు. 

హైదరాబాద్‌లో కేసు నమోద- ఇంటర్‌పోల్ ప్రవేశం

అమెరికా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిఖిత కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కుమార్తెను అర్జున్ శర్మ మోసం చేసి అప్పుగా తీసుకున్న డబ్బులు అడిగినందుకే కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడని నిఖిత  తండ్రి ఆనంద్‌ హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు అర్జున్ శర్మపై ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మరోవైపు నిందితుడు అర్జున్ శర్మ అమెరికా నుంచి తప్పించుకొని భారత్ వచ్చినట్టు గుర్తించిన అమెరికా పోలీసులు భారత్ అధికారులను సంప్రదించారు. అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్‌-బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న విషయం గుర్తించారు. దీంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేశారు.

ఆగ్రాలో నిందితుడు అరెస్టు

నిందితుడు అర్జున్ శర్మను పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. నిందితుడు దేశంలో ఎక్కడ ఉన్నాడనే దానిపై దర్యాప్తు చేపట్టి ఆగ్రాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక అపార్ట్‌మెంట్‌లో అర్జున్ శర్మ దాక్కున్నట్టు పోలీసులు సమాచారం సేకరించారు. హైదరాబాద్‌ పోలీస్ ప్రత్యేక బృందం ఆగ్రాకు చేరుకొని, స్థానిక పోలీసుల సహకారంతో అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నమోదైన మోసం కేసుకు సంబంధించి మొదట అతడికి నోటీసులు జారీ చేశారు. ఆపై కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో తదుపరి చర్యలు చేపట్టామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. 

అమెరికాకు అప్పగించే దిశగా చర్యలు 

ఆగ్రాలో అరెస్టు అయిన అర్జున్ శర్మను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్‌కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిందితుడు అర్జున్ శర్మను అమెరికాకు తరలించే ప్రక్రియ ఊపందుకుంది. అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నిందితుడిని అమెరికా అధికారులకు అప్పగించానికి తదుపరి చట్టపరైన చర్యలను హైదరాబాద్‌ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి.