NHRS Notices : తెలంగాణ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయిన వీడియో ఆధారంగా...సుమెటోగా స్వీకరించింది. తెలంగాణ (Telangana)కు సర్కార్ నోటీసులు జారీ చేసింది.  హైకోర్టు నిర్మాణం కోసం జయశంకర్ విశ్వవిద్యాలయం (Jayasankar University ) భూములను ప్రభుత్వం కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు పలికేందుకు ఏబీవీపీ నాయకులు యూనివర్శిటీకి వెళ్లారు. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు రెచ్చిపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఏబీవీపీ మహిళా నేతను...బైక్ మీద వెళ్తున్న కానిస్టేబుళ్లు జుట్టుపట్టుకొని లాగారు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ స్పందించింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ...తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి చెందిన భూమిని కేటాయించడాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఈ ఘటనపై సీరియస్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ... సుమోటోగా స్వీకరించింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితితోపాటు ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


మరోవైపు వ్యవసాయ వర్సిటీలో విద్యార్థినిపై పోలీసుల దాడిపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులైన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి  ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థినిని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్లడం అమానుషమని మండిపడింది. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది.