నీరజ్ హత్య కేసులో నిందితులకు రక్షణ కల్పించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు వారి బంధువులు, తల్లిదండ్రులు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులకు ప్రాణ హాని ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ రక్షించాలని వేడుకున్నారు.
హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో వ్యాపారి కుమారుడు నీరజ్ పన్వార్ దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలో సంచలనం కలిగించిన ఈ కేసులో ఆరుగుు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత పురోగతి కోసం నిందితులను షాహీనాయతగంజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో వారి బంధువుల్లో టెన్షన్ మొదలైంది. వారికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందేమో అన్న కంగారు వారిలో కనిపిస్తోంది. అందుకే వాళ్లంతా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. పోలీసుల అదుపులో ఉన్న తమ బిడ్డలను కాపాడాలంటూ వేడుకున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న నిందితులైన తమ పిల్లలను లాక్ డెత్, ఎన్ కౌంటర్ చేస్తారనే అనుమానంగా ఉందని మానవహక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పిల్లలకు ప్రాణ రక్షణ లేదని.. విచారణ పేరుతో వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. నీరజ్ హత్య కేసులో ప్రమేయం లేని వాళ్లను కూడా పోలీసులు భయపెడుతున్నారని... అక్రమ కేసుల్లో ఇరికించచే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు.
పోలీసులు నాలుగు రోజుల కస్టడీలో తమ వారిని చట్టబద్ధంగా విచారణ చేసేలా మానవహక్కుల కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని వేడుకున్నారు. హింసించే విధంగా కొట్టకూడదని హెచ్చార్సీను కోరారు. ఈ విషయంలో మాట్లాడేందుకు త్వరలో నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ను కలవనున్నట్లు వారు తెలిపారు.
బేగం బజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరజ్ పన్వార్ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతడ్ని అడ్డుకున్నారు. బైక్ ఆపిన వెంటనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నీరజ్ పన్వార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు రాళ్లతో కూడా యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 సార్లు కత్తితో పొడవడంతో నీరజ్ పన్వార్ కుప్పుకూలిపోయి అక్కడే మరణించాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో పగ పెంచుకున్న యువతి బంధువులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఏడాది కిందట నీరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.
గత ఏడాది నీరజ్ పన్వార్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి అమ్మాయి కుటుంబసభ్యులు అతడిపై కక్షకట్టారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు బేగంబజార్ మచ్చి మార్కెట్‌లో వెళ్తున్న నీరజ్ పన్వార్ బైక్ అడ్డుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారు. వెంటనే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు.