హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన నవీన్ అనే బీటెక్ విద్యార్థి కిరాతక హత్య కేసులో రాన్రానూ సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో బయటికి వస్తున్న వాస్తవాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. పోలీసుల ఎదుట హరిహరక్రిష్ణ నేరాన్ని అంగీకరించి జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం హరిహర క్రిష్ణ కస్టడీ ముగిసింది. కస్టడీలో ఉండగా హరిహర క్రిష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘నాకు బీటెక్ సెకండియర్ నుంచి నవీన్ ఫ్రెండ్. మేం వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్ చేస్తున్నా తరచూ కలుసుకునేవాళ్లం. నవీన్, నిహారిక తొలుత ప్రేమించుకున్నారు. ఆ విషయాలు నాకు చెప్పేవాళ్లు. తర్వాత నవీన్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నిహారిక గొడవ పడింది. నిహారిక అంటే నాకూ ఇష్టం వాళ్లు విడిపోయారని తెలిశాక నేను ఆమెకు ప్రపోజ్ చేయడంతో సరేనంది.
నవీన్ నిహారికకు కాల్స్, మెసేజెస్ చేస్తుంటే ఆమెకు నచ్చేది కాదు. ఆమెను ఇబ్బందిపెడుతున్నందునే నవీన్ ను చంపాలని మూడు నెలల క్రితం అనుకున్నా. మలక్ పేట్ డీమార్ట్ లో చాకు కొన్నా. ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నా. వాటిని ఇంట్లో ఎవరికి కనబడకుండా ఇంట్లోనే దాచా. జనవరి 16న ఫ్రెండ్ అంతా కలుసుకున్నప్పుడే నవీన్‌ను చంపాలని అనుకున్నా. కానీ అప్పుడు కుదరలేదు.
మళ్లీ ఫిబ్రవరి 17న నవీన్ హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను నా ఫ్రెండ్ నవీన్‌ను పికప్ చేసుకొని నాగోల్‌లో భోజనం చేసి, నేను నవీన్ మలక్‌పేట్‌లోని మా ఇంటికి వెళ్లాం. నా ఫ్రెండ్ వెళ్లిపోయాడు. ఆ రోజు నవీన్ హాస్టల్‌కు వెళ్తా అంటే నేను కూడా అతనితో వెళ్లా. అదే ఛాన్స్ అనుకొని ఇంట్లో దాచిన చాకు, గ్లౌజులు కూడా తీసుకెళ్లా. ఓఆర్ఆర్ దాటాక ఇద్దరం మందు తాగాం. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారిక విషయంలో గొడవపడ్డాం. అసలే కసి మీద ఉన్న నేను నవీన్‌ను తోసేసి గొంతు నులిమి చంపేశా. చనిపోయాడని గుర్తించి కత్తితో శరీర భాగాలను కోశాను. శవాన్ని చెట్ల పొదల్లో పడేశాను.
శరీర భాగాలను బ్యాగులో వేసుకొని బ్రాహ్మణ పల్లి వైపు వెళ్లాను. దాన్ని రాజీవ్ గ్రుహకల్ప వెనక పడేశా. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లిలో ఉన్న ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్లా. అక్కడ బట్టలు మార్చుకొని హాసన్‌కు హత్య విషయం చెప్పేశా. అతను భయపడి లొంగిపోవాలని చెప్పేశాడు. ఉదయం లొంగిపోతానని చెప్పారు. రక్తపు బట్టలను సాగర్ కాంప్లెక్స్ వద్ద చెత్తకుప్పలో పడేశా. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నిహారికకు ఫోన్ చేసి రమ్మన్నా. ఆమెతో జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఆమె భయపడి తిట్టింది. బైక్‌పై ఆమెను దిగబెట్టి నేను ఇంటికెళ్లా. నాన్న కూడా నన్ను లొంగిపోవాలని చెప్పాడు. మళ్లీ 24న హాసన్ ఇంటికి వెళ్లా. ఇంకా లొంగిపోలేదని అతను తిట్టాడు. శరీర భాగాలు పడేసిన సంచిని మళ్లీ తీసుకెళ్లి హత్య జరిగిన స్పాట్‌లో కాల్చేశా. ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయా’’ అని చెప్పాడు.
నిహారిక స్టేట్మెంట్
‘‘నవీన్ తో గొడవ అయినప్పుడల్లా హరిహర క్రిష్ణతో చెప్పుకునేదాన్ని. వాడ్ని కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అనేవాడు. ఒకరోజు వాళ్లింటికి తీసుకెళ్లి నవీన్ ను చంపేందుకు వీటిని కొన్నానని చాకు, గ్లౌజులు చూపించాడు. నేను నమ్మలేదు. అలా చేయొద్దని తిట్టా. హత్య జరిగిన రోజు ఉదయం హరి నన్ను కలవాలని మెసేజ్ చేస్తే వెళ్లా. అప్పుడు జరిగిన విషయం చెప్పాడు. వరంగల్ వెళ్లడానికి డబ్బు కావాలంటే ఇచ్చా. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అనుకున్నా. మళ్లీ ఫిబ్రవరి 20న హరి ఎల్బీ నగర్‌లో కలిసి నవీన్ ను చంపిన ప్రాంతాన్ని చూపించాడు. ఫిబ్రవరి 24న హరిని మళ్లీ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో చూశాం. అక్కడ మాట్లాడి తాను పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. పోలీసులకు, నవీన్ ఫ్రెండ్స్‌కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో తాను దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు.’’ అని నిహారిక పోలీసుల విచారణలో వెల్లడించింది.