తెలంగాణలో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న నిహారికకు ఊరట కలిగింది. కోర్టు ఆమెకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) అయిన హరిహరకృష్ణ ప్రియురాలు నిహారిక. తాజాగా ఈమెకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజురు చేసింది. దీంతో ఆమె చర్లపల్లి జైలు నుంచి విడుదల కానుంది. ఈ కేసులో హరిహరకృష్ణ A1 , హరి స్నేహితుడు హాసన్ A2 కాగా, నిహారిక A3గా ఉన్నారు.


అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్య కేసులో నిహారిక ప్రేమ కారణంగానే తాను నవీన్ ను అంతం చేసినట్లుగా నిందితుడు హరిహరకృష్ణ విచారణలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పకపోవడం, నిందితుడికి తాము సాయం చేసినట్లుగా హరి ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్‌లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. అంతేకాకుండా నవీన్ హత్య తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు, మెసేజ్ లను తొలగించి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం కూడా చేశారు. దీంతో నిహారిక, హరి స్నేహితుడు హసన్‌లను నిందితులుగా చేర్చారు. 


వీరిని పోలీసులు ఫిబ్రవరి 6వ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నిందితులు ఇద్దరని హయత్‌ నగర్‌ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. ఇటీవల నిహారిక బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.


నల్గొండ ఎంజీ యూనివర్శిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌‌కు.. అదే కాలేజీలో చదువుతున్న హరిహరకృష్ణ స్నేహితులు. వీరు ఇద్దరూ ఒకే అమ్మాయి విషయంలో గొడవపడ్డారు. క్రమంగా నవీన్ పై అక్కసు పెంచుకున్న హరిహర క్రిష్ణ అతణ్ని చంపేశాడు. ఫిబ్రవరి 17న నవీన్‌ను గెట్‌ టుగెదర్‌ పేరుతో పిలిచిన హరిహరకృష్ణ ఆ రోజు రాత్రి వరకూ నవీన్ ఉండేలా ప్లాన్ వేశాడు. సాయంత్రం దాటేవరకు నవీన్ ను ఎల్బీనగర్‌, ఇతర ప్రాంతాల్లో తిప్పాడు. తిరిగి వెళ్లిపోతానని నవీన్‌ చెప్పడంతో నల్గొండలో దింపుతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు హరిహరకృష్ణ. హయత్‌ నగర్‌ దాటాక మద్యం తీసుకుని,  అబ్దుల్లాపూర్‌మెట్‌లో ముందే ప్లాన్ చేసుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా మర్డర్ చేశాడు. శరీరభాగాలను వేరు చేశాడు.