Sigachi chemical balst incident | పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పేలుడు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్ పై హత్యగా పరిగణింపబడని (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ) కేసు నమోదు చెయ్యాలంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని పిటిషన్ వేశారు.

సిగాచి కెమికల్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు 25, 00, 000 (25 లక్షలు) చొప్పున పరిహారం చెల్లించే విధంగా సిగాచి యాజమాన్యాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అదే విధంగా ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్మికులకు 10, 00, 000 (రూ.10 లక్షలు) చొప్పున పరిహారం చెల్లించాలని ఇమ్మానేని రామారావు కోరారు. రాష్ట్ర కార్మికులు, ఉపాధి కల్పన, కర్మాగారాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ను ప్రతివాదిగా పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కంపెనీలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వాలని  న్యాయవాది రామా రావు ఇమ్మానేని తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సంఖ్య 15315/IN/2025  గా నమోదు చేసింది. దీనిపై త్వరలో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. 

బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచి కెమికల్స్ లో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో ఇప్పటివరకూ 36 మంది కార్మికులు చనిపోయారని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సిగాచి కెమికల్స్ పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను స్వయంగా పరిశీలించిన ఆయన, అధికారులను అడిగి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు  రూ.1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయం ప్రకటించారు. సిగాచి యాజమాన్యం నుంచి రూ.1 కోటి, గాయపడిన వారికి రూ.5 లక్షలు పరిహారం వచ్చేలా చేస్తామన్నారు.