Notices To Telangana CM Revanth Reddy: పరువునష్టం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ విచారించిన కోర్టు సీఎం రేవంత్ కు సమన్లు జారీ చేసింది.


పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా సభలో రేవంత్ తప్పుడు ప్రచారం చేశారని కాసం వెంకటేశ్వర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని నిరాధార ఆరోపణలు చేశారని రేవంత్ పై పిటిషన్ వేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీకి పరువు నష్టం కలిగిందని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ వాంగ్మూలం సేకరించింది. బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడిన వీడియోలను సైతం పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. బుధవారం ఈ పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.






లోక్‌సభ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల రద్దు రచ్చ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పదంగా మారిన అంశం రిజర్వేషన్ల రద్దు. బీజేపీ అగ్రనేతలు మత పరమైన రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీన్ని కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినా, అంతగా సఫలం కాలేకపోయారు. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. ముస్లిం రిజర్వేషన్లు సైతం రద్దు చేస్తుందని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు అదే సమయంలో తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించకపోగా, రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు రద్దు, పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.