డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ తీపి కబురు వినిపించారు. హైదరాబాద్‌ నగర పరిధిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించడం త్వరలోనే మొదలు అవుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో ఇళ్ల పంపిణీ ప్రారంభం కానుందని మంత్రి చెప్పారు. అక్టోబర్ మూడో వారం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 70 వేలకుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారని అన్నారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉందని వివరించారు.


ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నారని చెప్పారు వీటిలో ఎక్కువ భాగం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని అన్నారు. చాలా కొద్ది చోట్ల మాత్రమే నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్షలో కీలక సూచనలు ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండొద్దని అన్నారు. లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందాలని చెప్పారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. 


అయితే, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి రెడీగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి జీహెచ్‌ఎంసీ ఒక షెడ్యూల్‌ సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం సాయం తీసుకుంటోంది.


వర్షాలపైన కూడా మంత్రి రివ్యూ
హైదరాబాద్ సహా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని నానుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో వరదలు, పారిశుద్ధ్యంపై సమావేశంలో చర్చించారు. ఇంకా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన వేళ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. 


ఎలాంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి సహాయక చర్యలు అవసరం వచ్చినా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరదల వల్ల ప్రాణ నష్టం జరగకూడదని ఆదేశించారు.


ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను కూడా ఎదుర్కొనడానికి అవసరమైన ఏర్పాట్లతో రెడీగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు మంత్రి కేటీఆర్‌కి తెలిపారు. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారుల్లో ఆ నిలిచి ఉన్న వరద నీటిని తొలగించే డీవాటరింగ్‌ పంపుల పరికరాలు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు. 


హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎంతో మెరుగుపడిందని, మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు తెలిపారు. అయితే, దీంతోనే సంతృప్తి చెందకుండా మరింత మెరుగ్గా పని చేయాలని, కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.