Musi Riverfront Development Project:శతాబ్ధాల చరిత్ర కలిగిన భాగ్యనగరానికి ప్రాణ నాడి అయిన మూసీ నదికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు వేగవంతం చేసింది. కేవలం ఒక నది ప్రక్షాళనంగానే కాకుండా నగరాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచేలా మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో నిర్వహించిన మూసీ ఇన్వైట్స్‌ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఆయన ప్రసగించారు. ఆ ప్రాజెక్టు వెనుక ఉన్న విజన్‌ను భవిష్యత్‌ తరాల కోసం తాము పడుతున్న తపనను వివరించారు. 

హైదరాబాద్‌ను లండన్, సింగపూర్, దుబాయ్ సియోల్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని రేవంత్ స్పష్టం చేాశారు. ఆయా దేశాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి, అక్కడ ఆర్థిక వ్యవస్థలు ఎలా బలోపేతం అయ్యాయో స్వయంగా అధ్యయనం చేసినట్టు వివరించారు. ప్రపంచం వేగంగా ముందుకెళ్తోంది, మనం కూడా ఆ అభివృద్ధిని అందుకోవాలి. అందుకే మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టాం. అని ఆయన పేర్కొన్నారు.  ముఖ్యంగా సింగపూర్, దుబాయ్, అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌ వంటి ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని నిపుణులు, అధికారులతో చర్చించిన తర్వాే ఈ బృహత్తర కార్యాచరణ రూపొందించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. 

మూసీకి కొత్త కళ 

మూసీ నదిలో కేవలం మురికి నీరు కాకుండా, నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 20 టీఎంసీలో గోదావరి జలాలను మూసికి తరలించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ 20 టీఎంసీలలో 2.5 టీఎంసీలను నదిలో నిరంతరం ప్రవహించేలా చూస్తామన్నారు. మిగిలిన నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం మళ్లిస్తున్నట్టు తెలిపారు. ఇది కేవలం పర్యాటక ప్రాజెక్టు మాత్రమే కాదని, నగరం దాహార్తిని తీర్చే కీలక వనరుగా మారుతుందని అన్నారు. 

నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ జలాశయాల ప్రాముఖ్యతను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1908లో వచ్చిన వరదల తర్వాత  మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల మేరకు నిర్మించిన జలాశయాలు నేటికీ నగరాన్ని కాపాడుతున్నాయని ఆయన కొనియాడారు. వందేళ్ల క్రితం పాలకులు అప్పట్లోనే ముందు చూపుతో అద్భుతాలు చేశారు. మరి నేటి తరం మనం ఏం చేస్తున్నామని సీఎం ప్రశ్నించారు. 

ఈ ప్రాజెక్టుో భాగంగా లంగర్ హౌస్‌ వద్ద మూసీ, ఈసీ నదుల సంగమ స్థలంలో ఉన్న బాపూ ఘాట్‌ను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కన్యాకుమారి తరహాలోనే బాపూ ఘాట్ కూడా విశిష్టతను సంతరించుకుంటుందని అక్కడ గాంధీ విగ్రహం, గాంధీ సరోవర్‌ నిర్మాణానికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. గాంధీ సరోవర్‌ కోసం రెండు వందల కోట్లు కేటాయిస్తే ప్రతిపక్షాలు దాన్ని ఐదు వేల కోట్టుల అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రాజెక్టుపై అనవసరం భయాందోళనలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలపై సీఎం విమర్శలు చేశారు. మూసీ అభివృద్ధిని అడ్డుకున్న వారు ఒక మూడు నెలలపాటు ఆ నది పక్కన నివశించగలరా అని ఆయన సవాల్ చేశారు. బుల్డోజర్‌తో ఇళ్లు కూల్చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఏ వసతి లేక మురికి కూపంలో మగ్గుతున్న వారికి మెరుగైన జీవితాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని భరోసా ఇచ్చారు. 

ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని సుమారు పదివేల కుటుంబాలకు మెరుగైన పునరావసం కల్పిస్తామని, అడ్డుకునే వారికి అవసరమైతే కంటైనర్‌ ఇళ్లు ఇచ్చి అక్కడే నివసించమంటామని చురకలు అంటించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ, అభివృద్ధి విషయంలో పొలిటిక్‌ పెరాలసిస్‌ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఏమైనా తప్పులు  ఉంటే సలహాలు ఇవ్వాలని అంతే తప్ప అభివృద్ధిని అడ్డుకోవద్దని బీఆర్‌ఎస్‌ బీజేపీ నేతలను కోరారు. 

మూసీ ప్రక్షాళన జరగకపోతే కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాదు దిగువన ఉన్న నల్గొండ జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటితో ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు చరమగీతం పాడాలంటే ఈ ప్రాజెక్టు అనివార్యమని ఆయన పేర్కొన్నారు. 

నేను మట్టి మనిషిని ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న వాడిని. ప్రజల కష్టాలు నాకు తెలుసు, భవిష్యత్‌ తరాలు మనల్ని క్షమించాలంటే ఈ రోజే ఈ బృహత్కార్యాన్ని చేపట్టాలి. అని రెవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా తనపై ఉన్న బాధ్యతను నెరవేరుస్తానని, హైదరాబాద్ చరిత్రను కాలగర్భంలో కలిసిపోనివ్వబోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు.