Uttam Kumar Reddy: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గత 13 రోజులుగా పంచాయతీ కార్యదర్శలు చేస్తున్న సమ్మెతో గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని తన లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జేపీఎస్ లు పని చేసిన కాలాన్ని సర్వీసుగా పరిగణించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతిచెందిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలల పాటు ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. పొరుగు సేవల కార్యదర్శులను కూడా రెగ్యులరైజ్ చేయాలని నల్గొండ ఎంపీ కోరారు.



2019 ఏప్రిల్ 12న 9,355 పంచాయతీ కార్యదర్శులను నియమించారని, వారి మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ 2022, ఏప్రిల్ 11వ తేదీన పూర్తి అయిందన్నారు. రెగ్యులర్ చేయకపోగా, ప్రొబేషనరీ పీరియడ్ ను మరో సంవత్సరం పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేసి, ఆ వెంటనే జులై 17వ తేదీన జీవో నంబర్ 26ను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. పరిశీలన సంవత్సరం కూడా ఈ ఏప్రిల్ 11వ తేదీతో ముగిసిందని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.


తక్షణమే వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉందా లేదా అని నల్గొండ ఎంపీ ప్రశ్నించారు. ఇప్పటికైనా పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరు చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. లేని పక్షంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక.. వారి తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. 


ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్లు:


• జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.
• 2019 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు వారు చేసిన పని కాలాన్ని సేవగా పరిగణించాలి.
• మరణించిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.
• OPS (ఔట్ సోర్సింగ్ సెక్రటరీ) వారిని కూడా క్రమబద్ధీకరించాలి.
• మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు మరియు 90 రోజుల పిల్లల సంరక్షణ సెలవులు ఇవ్వాలి.


ఉత్తమ్ తో ఆస్ట్రేలియా అంబాసిడర్ భేటీ


గాంధీ భవన్ లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆస్ట్రేలియా అంబాసిడర్ బృందం భేటీ అయింది. ఉత్తమ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేరి ఓ ఫెరల్, ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సారా కిర్లె, జాక్ టేలర్ పొలిటికల్ సెక్రటరీ ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ నిర్మాణ శైలిని పరిశీలించారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.