మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. మత్తు పదార్థాలు తీసుకుంటారని.. మంత్రి కేటీఆర్‌పై ఉన్న ఆరోపణలు కిషన్ రెడ్డిపై లేవని, కేటీఆర్ మాదిరి బాలీవుడ్ వాళ్లతో కిషన్ రెడ్డికి దోస్తానా లేదన్నారు.  


కవిత లిక్కర్ రాణి అని ఆమె మాదిరి.. కిషన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేవని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బాట సింగారం.. డబుల్ బెడ్రూం ఇళ్ళకు బాట ఉంది కానీ.. సింగారం లేదని ఎద్దేవా చేశారు. అక్కడ అసంపూర్తిగా ఉన్న ఇళ్ల ఫొటోలను మీడియాకు చూపించారు. పేదల ఇళ్ళ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ధర్మపురి అరవింద్ విమర్శించారు. పేదలు పాలకుల కాళ్లు మొక్కితే ఇల్లు కేటాయిస్తున్నరని ఆరోపించారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్మిస్తున్న ఇళ్లను తనిఖీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఆవాస్ యోజన కింద మూడు కోట్ల గృహ ప్రవేశాలు పూర్త చేసుకున్నట్లు చెప్పారు. కానీ తెలంగాణాలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. హౌసింగ్ శాఖలో 1821  ఉద్యోగులు ఉండాల్సి  ఉండగా కేవలం 505 మంది ఉన్నారని అన్నారు. 1306 మందిని వివిధ శాఖలకు డిప్యుటేషన్ పంపించారని అన్నారు. ఇళ్ల నిర్మానంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం ఆ పార్టీ కార్యకర్తలకు కూడా న్యాయం చేయడం లేదని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ నిలదీశారు.


కిషన్ రెడ్డి అరెస్ట్


చలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయబోయారు. ఈ ఉదయం నుంచి ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చలో బాటసింగారం నిర్వహిస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని అప్రమత్తమైన పోలీసులు బీజేపీ లీడర్లను అరెస్టు చేశారు.  ఈ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తత ఏర్పడింది.
పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. జోరు వానలోనే రోడ్డుపై బైఠాయించారు. కిషన్ రెడ్డి, రఘునందన్‌రావు మినహా మిగిలిన వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. బాటసింగారం తీసుకెళ్లాలని పోలీసులను బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కాన్వాయ్‌నే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. తానేమీ టెర్రరిస్టును కాదని అన్నారు. నిరసన తెలిపే హక్కు తనకు ఉందని కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంటే ప్రతిపక్షంగా బీజేపీ అడగటం తప్పా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. పరిశీలనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఉదయం ఐదు గంటల నుంచే పోలీసులు తమ వాహనాలను తీసుకొచ్చి ఇళ్ల చుట్టూ మోహరించారని ఆరోపించారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial