Hyderabad Crime News: హైదరాబాద్‌కు సమీపంలోని గాజులరామారంలో ఘోరమైన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని గొంతుకోసి హత్య చేసింది. తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుంది. గురువారం జరిగిన ఈ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.  

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం వాసి వెంకటేశ్వరరెడ్డి కుటుంబంతో కలిసి బాలాజీ లే అవుట్‌లో ఉంటున్నారు. ఆయనకుభార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు తేజస్విని, పెద్ద కుమారుడు పేరు ఆశిష్‌ వయసు ఏడేళ్లు. రెండో కొడుకు పేరు హర్షిత్‌ రెడ్డి వయసు ఐదేళ్లు. వెంకటేశ్వరరెడ్డి ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు.   

గురువారం మధ్యాహ్నం మూడున్నరకు భార్య తేజస్విని అపార్ట్మెంట్ పై నుంచి దూకేసింది. స్థానికులు వెళ్లి చూడగా చనిపోయి ఉంది. విషయాన్ని భర్తకు తెలియజేశారు. అతను వచ్చే లోపు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. 

తేజస్విని ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి ఇంట్లో తలుపు తీసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అక్కడకు వెళ్లి చూస్తే వంట గదిలో ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. కంగారుపడ్డ స్థానికులు వెంటనే ఆ పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.  

తల్లే ఇద్దరి పిల్లల్ని చంపేసి తర్వాతను ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడి పరిస్థితులు చూసి నిర్దారించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు వివరాలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కేసుల విచారణలో భాగంగా ఆ ఇంట్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. వాళ్లకు ఓ కీలకమైన 8 పేజీల లేఖ దొరికినట్టు సమాచారం. 

ఆ లేఖలో తన బాధను తేజస్విని వివరించారు. తనకు పిచ్చి లేదని కానీ పిల్లల బాధను చూస్తే తట్టుకోలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. పిల్లలకు రెండు గంటలకోసారి కంటిలో మందులు వేయాలని లేకు బాధతో అల్లాడిపోతారని తెలిపారు. తల్లిగా అలాంటివి చూసి తట్టుకోలేకపోతున్నాని అన్నారు. దీనికి తోడు అంతా పిచ్చిదీ అంటూ ఉంటే మనసుకు కష్టంగా ఉందని ఆ లేఖలో రాసి పెట్టుకుంది.