హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చినా వాటిని ఎవరికి ఖర్చు పెట్టిందో వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ తరువాతే పోలవరం- బనకచర్ల లింకేజీ ప్రాజెక్టు ప్రారంభమైందని సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి చక్రవర్తి రేవంత్ రెడ్డి తన ఫెవరెట్ సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టారు. అందుకే ఈరోజు వరకు తెచ్చిన అప్పులతో పాటు వాటి ఖర్చుల లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన అనుభవం ఉపయోగించి గోదావరి, కావెరి లింకేజీ అని 96 శాతం నిధులు కేంద్రం నుంచి రాబట్టి పనులు చేసుకుంటున్నారు. నీళ్లు దోపిడీకి గురవుతుంటే అసమర్థ తెలంగాణ సీఎం ఏడాది తరువాత మేల్కొన్నారు. 2024 జులైలో ప్రాజెక్టు మొదలైతే ఇప్పటివరకూ కేంద్రాన్ని సంప్రదించలేదు, ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రశ్నించలేదు. కనీసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా పెట్టాలని అడిగే పరిస్థితి కనిపిస్తలేదని కవిత అన్నారు.

 ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు డబ్బులు పెడతలేరు. మరోవైపు ప్రజలకు పథకాలు ఇస్తలేరు. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి. ఆధారాలు వచ్చాక ప్రజల ముందు పెడతాం.సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి రెండు సంస్థలకు మెఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థలకు అడ్వాన్స్ రూ.1200 కోట్లు ఇచ్చారు.  ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏదన్న ప్రాజెక్టు తలపెడితే అడ్వాన్స్ ఇయ్యలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అడ్వాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో చెంచా మట్టి కూడా తీయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు మాత్రం వెళ్లిపోతున్నాయి.

పథకాలకు డబ్బులు లేవు.. పైసలు ఎక్కడకి పోతున్నాయి

ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి అవినీతి భాగవతమంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను. నేను ఆధారం లేకుండా మాట్లాడను. గతంలో రాజా ఆఫ్ కరప్షన్ అని కాంగ్రెస్ నేత ఉండేవారు. రేవంత్ రెడ్డి అవినీతి బాగోతం అంతా కూడా మంచి బుక్ చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచుతాం. నిన్న పైసలు ఇస్తే గాని ఫుడ్ పెట్టమని చెబితే కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేశారు. విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్లు కడుపు నింపుతున్నారు. కమిషన్లు తీసుకున్నారు కాబట్టే, మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదు ఇస్తున్నాం. 

బీజేపీ ఎంపీలకు రోషం, పౌరుషం లేవురెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేత పత్రం విడుదల చేయాలి. ప్రభుత్వం దేనికి ఎంత స్పెండ్ చేసిందో రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా చెప్పాలి.  భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే ఎనిమిది మంది బిజెపి ఎంపీలుకు కనీసం చీమ కుట్టినట్టు లేదు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు. కేంద్ర కేబినెట్ భేటీలో పుణేలో మెట్రోకు 3500 కోట్లు ఇచ్చారు. మనకు ఏం ఇచ్చారని తెలంగాణ బీజేపీ ఎంపీలు అడిగేటటువంటి ఆస్కారం కూడా కనిపిస్తలేదు. 

జూలై 6న ప్రజా భవన్ లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టారు. ఈయన గోదావరి నీళ్లు అన్ని ఇచ్చిన తర్వాత అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ తో బనకచర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100% వాస్తవం. ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంతం మేధావులు కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏవి వెంకటేశ్వరరావు, కంభంపాటి పాపారావు, అక్కినేని భవాని ప్రసాద్, లక్ష్మీనారాయణ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన తెలంగాణ వల్లనే అని వాళ్ళు చెప్తున్నారు. కేవలం మెఘా సంస్థ కోసమే ప్రాజెక్టులు అని చెబుతున్నారు. వీటి మీద సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెచ్చిన అప్పుల వివరాలు లెక్కలతో సహా వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని’ కవిత డిమాండ్ చేశారు.