Deeksha Divas: "తెలంగాణ వచ్చుడో... కెసిఆర్ సచ్చుడో" అనే నినాదంతో ఏకంగా అమరణ దీక్షకు పూనుకున్నారు. 2009 నవంబర్ 29న కరీంనగర్‌లోని తీగల గుట్టపల్లి నుంచి సిద్దిపేటలోని దీక్షాస్థలికి బయలుదేరారు. పోలీసులు అరెస్టు చేసినా వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రిలోనే దీక్ష చేపట్టారు. కేంద్రాన్ని కదిలించారు. తెలంగాణ ఉద్యాన్ని మలుపు తిప్పి స్వరాష్ట్ర సాధనకు కారణమైన కీలక ఘట్టం. అందుకే ఆ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీఆర్‌ఎస్ శ్రేణులు. నేతలంతా ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
కేసీఆర్ పోరాటం అనితర సాధ్యమని అన్నారు మంత్రి కేటీఆర్. ఒక నవశకానికి నాంది పలికిన రోజని... ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజని తెలిపారు. చరిత్రను మలుపు తిప్పిన రోజు 29నవంబర్ 2009 అని ట్వీట్ చేశారు. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజగా కీర్తించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 13 ఏళ్ల క్రితం ఇదే రోజున నిరాహార దీక్షను ప్రారంభించించారని ఎమ్మెల్సీ కవితి ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అంటూ నినదించి దీక్ష చేశారని చెప్పుకొచ్చారు. ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు నవంబర్ 29, దీక్షా దివాస్ అని పేర్కొన్నారు. ఆనాటి ఆమరణ నిరాహార దీక్ష స్పూర్తితోనే.. రాష్ట్రం ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలో.. సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత వివరించారు. నేడు రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
తెలంగాణలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు వివరించారు. మరో 10 లక్షల మందికి పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారన్నారు. 65 లక్షల రైతులకు రైతు బంధు, ప్రతి రంగంలో ఉన్న పేదవారికి ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని కవిత చెప్పుకొచ్చారు.. తెలంగాణ బాటలోనే అనేక రాష్ట్రాలు పథకాలు అమలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఏడేళ్ల కిందట ప్రారంభమైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు అప్పు చేయకూడదని, వారి ఇళ్లల్లో సంతోషం నింపేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహానికి రూ.51,000 వేల ఆర్థిక సాయాన్ని అందించేవారు. తర్వాతిరోజుల్లో పథకాన్ని బీసీలకు సైతం వర్తింపజేశారు. 2017లో ఈ మొత్తాన్ని 75,116కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 19, 2018 నుంచి కల్యాణలక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1,00116 లకు పెంచడం తెలిసిందే.