MLC Jeevan Reddy: తెలంగాణలో జీవో 111 రద్దు నిర్ణయంపై ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కోసమే జీవో 111 రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జీవో 111పై వేసిన కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముందుగానే రైతుల నుండి భూములు కొని ఆ తర్వాతే జీవో 111 రద్దు చేశారని, ఒక్కో నేత వద్ద వందల ఎకరాల భూమి ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 పరిధిలో భూముల క్రయ విక్రయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
'రాష్ట్రాన్ని అమ్ముకుపోవడమే లక్ష్యం'
ఆరు నెలల్లో తెలంగాణను అమ్ముకుని పోవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే జీవో 111ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భూములు అన్నీ రైతుల చేతుల్లో నుండి బడా బడా వ్యాపార వేత్తలు, బీఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, వారి కోసమే జీవో 111ను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. చెరువులన్నీ కబ్జా చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. హైదరాబాద్ జంట జలాశయాలను ఎలా కాపాడతారో చెప్పాలని డిమాండ్ చేశారు.
'చెరువును కబ్జా చేయడమే సర్కారు ఉద్దేశం'
' ట్రిపుల్ వన్ జీవో రద్దుతో ప్రధానంగా లాభపడేది రాజకీయ నాయకులు, భూస్వాములు, వ్యాపారస్తులు. 84 గ్రామాల పరిధిలో ఉన్న భూముల్లో 50 శాతానికి పైగా క్రయవిక్రయాలు ఇప్పటికే జరిగిపోయాయి. లక్ష ఎకరాలకు నాలా కన్వర్ట్ చేస్తే 10 వేల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. లక్ష ఎకరాల్లో ప్రభుత్వం భూమి 30 వేల ఎకరాలు ఉంది. 30 వేల ఎకరాలను అలాట్‌మెంట్ పేరుతో అమ్ముకుంటే మరో 50 వేల కోట్ల రూపాయలు వస్తాయి. మళ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పలేం కాబట్టి ఈ 6 మాసాల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అందినకాడికి అమ్ముకుని పోవాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రిపుల్ వన్ జీవో పరిధిలో జరిగిన భూముల క్రయవిక్రయాలు, భూ బదిలీలపై ప్రభుత్వం వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. దాంతో అసలు విషయం బహిర్గతం అవుతుంది.
అసలైన రైతుల వద్ద 25 శాతం భూములు కూడా ఉండవు. రైతులందరినీ పక్కకు జరిపి, జీవో 111 రద్దును తెరపైకి పట్టుకొచ్చారు. రైతుల నుండి భూముల కొన్న వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఉంది. హిమాయత్ సాగర్, గండి పేట ఉస్మాన్ సాగర్ జలాశయాలను ఏ విధంగా కాపాడతారు? కాళేశ్వరం ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం కాదు. అది అడిషనల్ సోర్సు. నేచురల్ సోర్స్ ను నిర్వీర్యం చేసి.. కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొస్తా, ఈ జలాశయాలు అవసరం లేదు అనడం మంచిది కాదు. చెరువులు అన్నింటినీ కబ్జా చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. జీవో 111 రద్దుపై పునఃపరిశీలించాలి' అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.