రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. తెలంగాణ శాసన సభలోని కమిటీ హాల్‌లో పోలింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి ఒక్కొక్కరుగా ఓటు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క కూడా ఓటు వేసేందుకు వెళ్లారు. అయితే, ఓటు వేసే క్రమంలో ఆమె పొరపాటు చేశారు. దీంతో మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అక్కడి ఎన్నికల అధికారులను కోరారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్‌పేపర్‌పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్‌ చేశారు. గ్రహించిన ఆమె తాను పొరపాటున ఓటు వేశానని, మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వాలని ప్రిసైడింగ్‌ అధికారులను కోరారు. కానీ, అందుకు వారు నిరాకరించారు. నిబంధనల ప్రకారం మరొక పేపర్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు.


ఓటు వేసిన అనంతరం సీతక్క బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తాను ఓటు వేసే క్రమంలో టిక్ కొట్టానని.. కానీ, పేపర్ పై ఇంక్ ఎక్కువ పడడంతో దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశానని అన్నారు. అంతా గజిబిజి అవ్వడంతో మరొక బ్యాలెట్ పేపర్ అడిగానని చెప్పుకొచ్చారు.


తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు క్రమంగా ఎమ్మెల్యేలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. తొలి ఓటు హక్కును కేటీఆర్ వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక పర్మిషన్‌తో ఏపీలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో ఓటు వేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.


మధ్యాహ్నం ఓటు వేసిన కేసీఆర్


సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు కూడా ఓటు వేశారు. విప‌క్షాల అభ్యర్థి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్దతు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.




 



ఇప్పటివ‌ర‌కు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఇంకా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యే చెన్నమ‌నేని ర‌మేశ్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి త‌మ ఓటు హ‌క్కును ఇంకా వినియోగించుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ కొనసాగనుంది. ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.