లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల పండుగ అని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఏటా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు.


ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఐక్యతకు మారుపేరు పండుగలు, ఉత్సవాలు అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు.


అనంతరం అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా కలసి ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు భక్తులకు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.