హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రాచుర్యం పొందిన చేప ప్రసాదాన్ని ఈ నెల 9న ఇవ్వనున్నట్లుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు పంపిణీ చేయనున్నారని తలసాని తెలిపారు. కరోనా వల్ల గత మూడు సంవత్సరాలుగా చేప ప్రసాదాన్ని పంచలేదని చెప్పారు. మళ్లీ ఈ ఏడాది నుంచి చేప మందును పంపిణీ చేస్తామని అన్నారు. బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది తరలివస్తారని మంత్రి తలసాని అన్నారు.


250 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్‌లు పని చేస్తున్నారన్నారని మంత్రి తలసాని అన్నారు. చేప ప్రసాదం ఇంటికి తీసుకెళ్లాడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు వెల్లడించారు. గోషామహల్ ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి  తలసాని తెలిపారు.


ప్రభుత్వ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా గత మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీని ఆపేశారు. అయితే ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీని గురించి కొద్ది రోజుల క్రితమే సచివాలయంలో రాష్ట్ర, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బత్తిని కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీపై మంత్రి తలసానితో మాట్లాడారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని వారు తెలిపారు.


ఈసారి భారీగా జనం వస్తారని అంచనా


చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కీలో మీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడంతో... ఈ సారి జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు. దాదాపు 170 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు ఆస్తమా పేషెంట్ల కోసం నగరంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో 2020లో తొలిసారి చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా, కొవిడ్19 నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత రెండేళ్లు కూడా ప్రభుత్వం నో చెప్పడంతో ఆస్తమా పేషెంట్లకు నిరాశే ఎదురైంది.