Kancha Gachibowli Land Dispute: హెచ్సీయూ భూవివాదంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయని ప్రచారం చేశారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించిన శ్రీధర్ బాబు కంచ గచ్చిబౌలిలో కుంభకోణం జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఇంత వరకు ఆ భూమిపై అప్పు తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాంటి సమయంలో బ్రోకర్ కంపెనీ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఆ భూమి లిటిగేషన్ ల్యాండ్ మాత్రం కాదని... ఎలాంటి కేసులు లేవని తేల్చి చెప్పారు. రూల్స్ ప్రకారమే నాన్ కన్వర్టబుల్ రిడీమెబుల్ డిబెంచర్లను టీజీఐఐసీ జారీ చేసిందని మంత్రి తెలిపారు. ఎక్కడా సెబీ రూల్స్ బ్రేక్ చేయలేదని ఇదంతా పబ్లిక్‌లో ఉన్న డాక్యుమెంట్ అని వివరించారు.
ప్రజల కోసం రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఫ్యూజర్ సిటీని ముందుకు కదలనీయకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇతర్రాష్ట్రాల్లో చనిపోయిన జంతువుల ఫొటోలను వీడియోలను చూపించి ఇక్కడ హెచ్సీయూ భూముల వద్ద జరిగినట్టు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొకటే కాదని ఏ పని చేసినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలని చూసినా, ఇప్పుడు ఫోర్త్ సిటీ కట్టాలని ప్రయత్నించినా, కంచగచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేయాలని చూస్తున్నా ఓర్వలేకపోతున్నారని ఆరోపణలు చేశారు.
ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారంతో విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉందని తెలిపారు. ఆయనే సీఎంగా కొనసాగుతారని అన్నారు. ఆయన అవినీతికి తావులేని పాలన అందిస్తున్నారని తెలిపారు. సచివాలయంలో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సచివాలయానికి ఎవరైనా రావచ్చని ఆమె కూడా వచ్చారని వివరించారు.