Telagnana Assembly Session Today | హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన కొనసాగించారు. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల ఘటనలో అమాయకులైన రైతులను అరెస్ట్ చేసి, వారికి బేడీలు వేశారంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. అందుకు నిరసనగా తమ చేతులకు సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకుని వచ్చారు. ప్రివిలేజ్ మోషన్ పై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతుల చేతులకు సంకెళ్లా అంటూ ప్రశ్నించారు. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం దద్దరలిల్లింది. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.


కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
ఉదయం సెషన్ అనంతరం అసెంబ్లీ లాబీల్లో మంత్రి సీతక్క చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క లాజిక్ పాయింగ్ చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలు అందరికీ ఒకే మాట, ఒకే బాట నిజమైతే హరీష్ రావు, కేటీఆర్‌లకు మినహాయించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు బేడీలు ఉండటంపై సెటైర్లు వేశారు. కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడిందని, నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదన్నారు సీతక్క. 



BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క


హరీష్ రావు, కేటీఆర్ దొరహంకారం
నిరసనల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు తమ దురంకారాన్ని ప్రదర్శించారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతులకు బేడీలు వేశారు తప్పా, కేటీఆర్, హరీష్ రావులు బేడీలు ఎందుకు వేసుకోలేదు. రైతులకు సంకెళ్లు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారు. అప్పుడు కనీసం అధికారులపై ఎలాంటి చర్యలు లేవు. 


కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా కాదన్న సీతక్క..
రైతులకు బేడీలు వేశారన్న విషయం తెలియడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై చర్యలు సైతం తీసుకున్నారు. కానీ శాసనసభలో బీఆర్ఎస్ పెట్టిన రూల్స్ పై ఆ పార్టీ సభ్యులే అభ్యంతరం చెప్పడం ఏంటి?. గతంలో వెల్ లోకి వెళ్లిన సభ్యులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే బీఆర్ఎస్ సభ్యులు కాలరాస్తున్నారు’ అని మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు.



శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలకు మద్దతుగా నిరసనకు దిగారు. రైతులకు మద్దతుగా  ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. తమ భూములు లాక్కోవద్దు అని నిరసన తెలిపిన అన్నదాతలకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తప్పిదం చేసిందన్నారు. ఇప్పటికైనా సభలో దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు. లగచర్లలో అరెస్ట్ అయిన రైతులను భేషరతుగా విడిచి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వేదికగా నినదించారు.


Also Read: Hydra: హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !