Hyderabad News: హైదరాబాద్‌లో ప్రస్తుతం హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను వదిలేసి, బీఆర్ఎస్ నేతలు, ఇతరుల ఫాంహౌస్‌లు, భవనాలను కూల్చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ రకమైన ఆరోపణలే చేశారు. కాంగ్రెస్ నేతలైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతల ఫాంహౌస్‌లను హైడ్రా కూల్చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ నిర్మించారని కేటీఆర్, హరీశ్ రావు ఆరోపిస్తున్నారు.
దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. దమ్ముంటే మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు వచ్చి తన ఇల్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు ప్రూవ్ చేయాలని సవాల్ చేశారు. అంతేకాకుండా, టేప్ పెట్టి కొలుచుకోవాలని చెప్పారు. తన ఇంటికి సంబంధించిన ఒక్క ఇటుక అయినా బఫర్ జోన్లో ఉన్నట్లు కనుక తేలితే.. వెంటనే కూల గొట్టాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు చెబుతున్నానని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆ ఇల్లు తనది కాదని.. తన కొడుకు పేరు మీద ఉందని అన్నారు. తాను ధైర్యంగా చెప్తున్నానని.. కేటీఆర్‌లా ఆ ఫామ్ హౌస్ నాది కాదని అబద్ధం చెప్పట్లేదని పొంగులేటి సెటైర్లు వేశారు. కేటీఆర్ తొత్తులు, బీఆర్ఎస్ మాజీలు తన మీద బురద చల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పొంగులేటి శ్రీనివాస్.