తెలంగాణ కార్మిక శాఖ మంత్రి ఎక్కడ మీడియాతో మాట్లాడినా వార్తల్లో నిలుస్తుంటారు. అంతకుమించి రీల్స్‌, షార్ట్స్‌లో వైరల్ అవుతుంటారు. ఆయన మాట్లాడే సరదా మాటలకి చాలా మంది ఫ్యాన్స్ కూడా అయిపోయారు. కొద్ది నెలల క్రితం విద్యార్థుల్లో స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో చేసిన వ్యాఖ్యలతో మల్లారెడ్డి విపరీతంగా వైరల్ అయ్యారు. కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్ వెల్ నడిపించినా, కాలేజీలు పెట్టినా.. లాంటి వ్యాఖ్యలు బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా కూడా ఆయన అలాంటి సరదా వ్యాఖ్యలే చేశారు.


మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్ లో మల్కాజ్గిరి జోన్ రాచకొండ కమీషనరేట్ పరిధిలో నూతన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. హోమ్ శాఖ మంత్రి మహముద్ అలీ, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.


బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హౌం మంత్రి మొహమూద్‌ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌ లను మంత్రి మల్లారెడ్డి కోరారు. పోలీసులు ఫిట్‌ నెస్‌ పెంచుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌లలోనే జిమ్‌ లు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ ప్రస్తుతం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని అన్నారు. కేసులను తొందరగా పరిష్కరిస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసించారు. తాము ఉన్నట్లుగా పోలీసులు కూడా మంచి ఫిట్‌ గా ఉండాలని చెప్పారు. పోలీసులను చూస్తే దొంగలు గజగజ వణికిపోవాలని అన్నారు.