Minister KTR: రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని.. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లో రెండో విడత డబుల్ బెడ్రూము ఇళ్ల పంపిణీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో కట్టిన లక్ష రెండు పడక గదుల ఇళ్లలో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తి అయిందని తెలిపారు. మిగిలిన 70 వేల డబుల్ బెడ్రూము ఇళ్లను కూడా అత్యంత పారదర్శకంగా రాబోయే నెల, నెలన్నర కాలంలో అర్హులైన వారికి అందజేస్తామని వెల్లడించారు.


కాంగ్రెస్, బీజేపీ నాయకులకూ ఇళ్ల పంపిణీ: కేటీఆర్


దుండిగల్ లోని 4 వేల ఇళ్లు కట్టేందుకు ఒక్కో ఇంటికి రూ.10 లక్షల చొప్పున ఖర్చు అయినట్లు కేటీఆర్ వెల్లడించారు. లక్ష ఇళ్లు హైదరాబాద్ లో నిర్మిస్తే రూ.9,718 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు తెలిపారు. ఒక్కో డబుల్ బెడ్రూము ఇల్లు కట్టేందుకు ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ. 10 లక్షలుగా పేర్కొన్నారు. కానీ లక్ష ఇళ్ల మొత్తానికి మార్కెట్ విలువ రూ. 50 వేల నుంచి రూ. 60 వేల కోట్ల వరకు ఉందని తెలిపారు. ఆ ఆస్తులను కేసీఆర్ సర్కారు పేదల చేతిలో పెడుతున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూము ఇళ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. ఎంత పాదర్శకంగా రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ జరుగుతుందో చెప్పడానికి కేటీఆర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. జగద్గిరిగుట్ట డివిజన్ 126వవ డివిజన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కౌసల్యకు మొదటి విడతలో డబుల్ బెడ్రూము ఇల్లు వచ్చిందని.. అదే డివిజన్ లోని బీజేపీ నాయకురాలు సునీతకు కూడా తొలి విడతలోనే ఇల్లు వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.


ఇవాళ దాదాపు 13,300 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇవాళ్టితో హైదరాబాద్ లో కట్టిన లక్షల ఇళ్లలో 30 వేల ఇళ్లు పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగతావి కూడా రాబోయే నెల, నెలన్నర కాలంలో పారదర్శకంగా పంపిణీ చేస్తామన్నారు. కేసీఆర్ ఆలోచన మేరకు ఈ ఒక్క రోజే 8 ప్రాంతాల్లో 13,300 ఇళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు 470, దళితులకు 1,923.. గిరిజనులకు 655, మిగిలిన వారికి 8,652 పంపిణీ చేశామన్నారు. 


భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనివిధంగా 560 చదరపు అడుగుల్లో ఉచితంగా ఇళ్లు కట్టించి ఇచ్చే ఎకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ అన్నారు. 
73 వేల కోట్లు రైతుబంధుతో పాటు దళితబంధు లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రంలో డబుల్ బెడ్రూములు ఆలస్యం అయిన మాట వాస్తవమని తెలిపారు. పారదర్శకంగా 3.5 లక్షల ఇళ్లను కట్టించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. 9 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణ రాష్ట్రం పద్దతిగా అగ్రస్థానానికి ఎదిగిందని తెలిపారు. 9 ఏళ్ల క్రితం ఖాళీ బిందెలు, కరెంట్ కష్టాలు, అధ్వానపు రోడ్లు ఉండేవని, వాటన్నింటిని తుడిచేసి నవ తెలంగాణను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.