Minister KTR: హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA) గువ్వల బాలరాజు(MLA Guvvala Balaraju)ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారక రామారావు (Minister KTR) పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొని తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు బాలరాజు అని కేటీఆర్ అన్నారు. దాడుల గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. డీజీపీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.
బాలరాజు ఓ అరాచక శక్తి
అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరాచక శక్తి గా తయారయ్యాడని కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi) ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బుల సంచులతో రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. గువ్వల బాలరాజు ఒక కారులో డబ్బుల సంచులతో పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, దాన్ని ఆసరా చేసుకొని గువ్వల బాలరాజు అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేశారని ఆరోపించారు.
బాలరాజుపై దాడి..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. ఎమ్మె్ల్యే గువ్వల బాలరాజు నుదిటిపై గాయలు అవడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్‌లను తరలిస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు వెంబడించారు.
డబ్బు తరలిస్తున్న వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వాహనం అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ ఆందోళన చేపట్టారు.
స్థానిక పోలీసులు, గువ్వల గన్‌మెన్లు, ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సపోర్ట్ చేస్తున్నారంటూ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు.
అయితే కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ కావాలనే రాళ్లతో దాడి చేశారని గువ్వల బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు. వంశీకృష్ణ స్వయంగా రాయి తీసి విసిరేయగా అది ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటికి తగిలిందని, వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తలపై బలమైన దెబ్బ తగలడంతో గువ్వల అపస్మారక స్థితికి చేరుకున్నారని ఆరోపించారు.
ఓటమి భయంతోనే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజలే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాయి బలంగా నుదిటిని తాకడంతో గువ్వల బాలరాజు పల్స్ పడిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.