ఎల్బీ నగర్ - సికింద్రాబాద్ మార్గంలో నాగోల్ వద్ద కీలక ఫ్లై ఓవర్ ను పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిత్యం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో దీన్ని నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకూ ఎలాంటి సిగ్నళ్లు లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చు. వంతెన ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాగోల్ ఫ్లై ఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్‌తో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్‌ చెప్పారు. ఇది 990 మీటర్ల పొడవుతో 6 లేన్లతో నిర్మించారని మంత్రి అన్నారు. ఈ ఫ్లై ఓవర్‌తో ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుందని అన్నారు.


వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా హైదరాబాద్‌లో మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యంగా నగరంలో చాలా ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ కింద మొత్తం 47 ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. మరో 16 ఫ్లై ఓవర్ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పూర్తయిన 31 పనుల్లో 15 ఫ్లై ఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ చెప్పారు. 


ఈ నాగోల్ ఫ్లైఓవర్ వరుసగా 16వ ఫ్లై ఓవర్ అని అన్నారు. చాలా మంది ప్రజలు ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగానే రాకపోకలు సాగిస్తూ ఉంటారని, కీలకమైన ఈ మార్గంలో ఫ్లై ఓవర్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు. హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ల పరంపర ఇక్కడితో ఆగబోదని మంత్రి చెప్పారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లు రానున్నాయని తెలిపారు. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా మరొకటి శిల్పా లే అవుట్ బ్రిడ్జి అని అన్నారు. ఈ రెండింటి పనులు పూర్తవుతున్నాయని, వీటిని కూడా డిసెంబర్‌ నాటికి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు.






47 ప్రాజెక్టుల్లో పూర్తయినవి ఇవీ..


ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా గ్రేటర్‌లో 47 ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఇందులో హెచ్‌ఎండీఏ, ఆర్‌ అండ్‌ బీ ఆరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టగా.. మరో 41 పనులు జీహెచ్‌ఎంసీ చేస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నాగోల్‌ వంతెన అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య 32కు చేరనుంది. ఇందులో 15 వంతెనలు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, ఐదు అండర్‌ పాస్‌లు, తొమ్మిది ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు ఉన్నాయి. మరో 16 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. శిల్ప లే అవుట్‌, డిసెంబర్‌నాటికి బొటానికల్‌ గార్డెన్‌ వంతెనలు అందుబాటులోకి వస్తే.. కూకట్‌పల్లి, మాదాపూర్‌, తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సులువు కానున్నాయి.