KTR on Governors: బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల తీరుపై మంత్రి విమర్శలు చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలను చూస్తే కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తుందని ట్వీట్ చేశారు. రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేటీఆర్ తన ట్వీట్ లో ప్రస్తావించారు.






తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యం. బాహాటంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. అయితే చాలా కాలంగా రాజ్ భవన్ లో పెండింగ్ పడిన బిల్లుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో.. మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్నవాటిలో కీలకమైన యూనివర్సిటీల నియామక బోర్డు, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పి పంపించారు. ఇంకో రెండు బిల్లులపై మరింత పరిశీలన అవసరమని పేర్కొంటూ రాజ్ భవన్ లోనే పెండింగ్ లో ఉంచారు. 


మొత్తంగా గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇటీవలి వరకు రాష్ట్ర శాసన సభ ఆమోదించిన 10 బిల్లులకు సంబంధించి.. రాజ్ భవన్ ఇచ్చిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీం కోర్టుకు అందజేశారు. 


గవర్నర్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం


ఈ విషయంపై మంత్రి హరీష్ రావు సీరియస్‌ అయ్యారు. కోర్టుల్లో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్‌ అవ్వని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. మంత్రులు కలిసినా గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను 7 నెలలుగా  గవర్నర్ ఆపారని హరీష్ గుర్తు చేశారు. రాజ్ భవన్ రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసన్నారు. ఎన్ని కుట్రలు చేసైనా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలనే బీజేపీ వైఖరి తేటతెల్లమైందని అన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా  అని ప్రశ్నించారు.


తమిళనాడు గవర్నర్ విషయంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయమే తీసుకుంది. బిల్లులను పెండింగులో పెట్టడంపై తమిళనాడు శాసనసభ ఏకంగా తీర్మానమే చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట వ్యవధిలో ఆమోదం తెలిపేలా తక్షణమే గవర్నర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది స్టాలిన్ ప్రభుత్వం. తీర్మానానికి అనుకూలంగా డీఎంకే, కూటమి పార్టీలు ఓటు వేశాయి. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్య సూత్రాలను, అత్యున్నత శాసనసభ సార్వభౌమాధికారాన్ని గవర్నర్ కాలరాస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఈ సభ ఏకగ్రీవంగా కోరుతోందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిర్దిష్ట వ్యవధిలో గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు.