తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్ఠానం ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని మతాలను సమ దృష్టితో చూస్తామని బీజేపీ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్ఠానం బండి సంజయ్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఱర్ ట్వీట్ చేశారు.


మహ్మాద్‌ ప్రవక్తపై ఓ టీవీ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి నూపుర్‌ శర్మను బహిష్కరించింది. నూపుర్‌ శర్మతో పాటు నవీన్‌ జిందాల్‌ అనే నాయకుడి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా బీజేపీ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 


నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా దేశంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో నూపుర్‌ శర్మ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. మహ్మద్‌ ప్రవక్తపై చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్టు ఇస్లామిక్ సంఘాలు ఆమెపై మండిపడుతున్నాయి. అయితే నూపుర్‌ శర్మ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. అన్ని మతాలను సమదృష్టితో తమ పార్టీ చూస్తుందని ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, మహ్మద్‌ ప్రవక్తపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటునట్టు నూపుర్‌ శర్మ ట్వీట్‌ చేశారు.


ఈయన వ్యాఖ్యల ఫలితంగా కాన్పూర్‌లో చేపట్టిన ఆందోళనలు భారీ హింసకు దారి తీశాయి. నూపుర్‌శర్మపై ముంబయితో పాటు చాలా చోట్ల పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని నూపుర్‌ శర్మ సమర్థించుకున్నారు. తనను చంపేస్తామని వేలాది ఫోన్‌ కాల్స్‌ వస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.


బండి సంజయ్ పై చర్యలు ఎందుకు లేవు - కేటీఆర్
నూపుర్‌ శర్మను సస్పెండ్‌ చేసిన బీజేపీ హైకమాండ్‌.. మసీదులను తవ్వుతానన్న బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని జేపీ నడ్డాను నిలదీశారు. మసీదులను తవ్వుతామని, దాని కింద శవం ఉంటే మీరు తీస్కోండి.. శివం వెళ్తే మాకియ్యండి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అంతేకాక, ఉర్ధూను కూడా బ్యాన్‌ చేస్తామన్న బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నిజంగా అన్ని మతాల పట్ల మర్యాదగా ఉన్నట్లయితే బండి సంజయ్ ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.